కేటి జకారియా ఔట్.. ప్రెస్ సెక్రటరీపై ట్రంప్ వేటు..!
వైట్హౌస్ (White House) ప్రెస్ సెక్రటరీ కేటి జకారియాపై వేటు పడింది. ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన ఐదురోజులకే ఆమెను తొలగించారు ట్రంప్. తొలి సమావేశంలోనే తడబడడం, ఆమె పనితీరుపై విమర్శలు రావడం, విద్యార్హతలపై ప్రశ్నలు తలెత్తడం ఈ పరిణామానికి కారణంగా తెలుస్తోంది. కేటి జకారియా.. ట్రంప్ కు మద్దతుదారైనప్పటికీ.. సమస్యల తలకెత్తుకోవడం ఇష్టం లేక ట్రంప్ ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేటీ జకారియా ఈ నెల 12న శ్వేతసౌధ మీడియా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ మరుసటి రోజే ఆమె తొలిసారి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆ సమావేశం 15 నిమిషాల్లోపే ముగిసింది. కేవలం ముగ్గురు విలేకరులు అడిగిన ప్రశ్నలకే ఆమె బదులిచ్చారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో తడబడ్డారు. దీంతో ఆమె పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు, తాను గతంలో న్యాయవాదిగా పనిచేశానని కేటీ ఓ సందర్భంలో చెప్పారు. అయితే, ఆమె విద్యార్హతలపై అనుమానాలున్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశమైంది. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ లాంటి ఉన్నత పదవిలో ఉన్న ఆమె అబద్ధాలు చెబుతోందని విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ (Donald Trump) విలేకరులతో మాట్లాడుతూ.. పదవిలో కొనసాగాలా? వద్దా? అనే అంశంపై పునరాలోచించుకోవాలని జకారియాకు సూచించినట్లు తెలిపారు. ఈ పని ఆమెకు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆమెను పదవి నుంచి తొలగించినట్లు వార్తలు రావడం గమనార్హం. అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేటి ముందు కెరోలినా లివిట్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. అయితే ఆమె ప్రెగ్నెన్సీ రావడం, కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండడంతో.. పదవి నుంచి వైదొలిగారు.. కెరోలినా పనితీరుపై ట్రంప్ కూడా పలుమార్లు ప్రసంశలు కురిపించారు. ఇప్పుడు కేటి జకారియా స్థానంలో మరొకరిని ఎంపిక చేయాల్సి ఉంది. దీనికోసం వైట్ హౌస్ .. అభ్యర్థుల జాబితాను స్క్రూట్నీ చేస్తున్నట్లు తెలుస్తోంది.








