పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ను రద్దు చేయకూడదని ట్రంప్ను కోరిన GOPIO
అమెరికాలో గ్రీన్ కార్డ్ ప్రక్రియలో కీలకమైన పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) ప్రోగ్రామ్ను రద్దు చేయకుండా సంరక్షించాలని వైట్ హౌస్కు గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (GOPIO) ఒక అధికారిక లేఖను సమర్పించింది. అమెరికన్ కార్మికులకు రక్షణ కల్పిస్తూనే, దేశంలో సాంకేతిక నూతన ఆవిష్కరణలను, గ్లోబల్ టెక్నాలజీ లీడర్షిప్ను కాపాడుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు. అమెరికాలోని గోపియో చాప్టర్లు, సభ్యుల తరఫున ఛైర్మన్ డా.థామస్ అబ్రహాం, ప్రెసిడెంట్ ప్రకాష్ షా ఈ లేఖను అందజేశారు.
అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా…
అమెరికా కార్మికులకు మొదటి ప్రాధాన్యతనివ్వడం, వేతనాలను రక్షించడం పట్ల తమకు పూర్తి మద్దతు ఉందని గోపియో అధికారులు స్పష్టం చేశారు. అయితే, PERM ప్రోగ్రామ్ను తొలగించడం లేదా చట్టబద్ధమైన దరఖాస్తులను విస్తృతంగా నిరోధించడం వల్ల అమెరికా సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో అగ్రస్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కృత్రిమ మేధస్సు (AI), సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ వంటి వ్యూహాత్మక రంగాలలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులైన సైంటిస్టులు, ఇంజినీర్లు, పరిశోధకుల అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.
మోసాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు…
కార్మికుల హక్కులను దెబ్బతీసే చర్యలు, మోసాలను అరికట్టడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సమర్థిస్తూనే, బాధ్యతాయుతమైన యజమానులకు, అర్హులైన నిపుణులకు చట్టబద్ధమైన మార్గాలను తొలగించకూడదని కోరారు. కార్మికుల కొరతను అధిగమించడానికి, ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రేషన్ విధానాలను పారదర్శకంగా ఉంచాలని సూచించారు.
యజమానులు కార్మిక రక్షణ నిబంధనలను పాటించినప్పుడు, అర్హులైన నిపుణుల కోసం PERM ను చట్టబద్ధమైన మార్గంగా కొనసాగించాలి.
మోసాలు, వేతన ఉల్లంఘనలు, అమెరికన్ కార్మికుల అక్రమ తొలగింపులపై పకడ్బందీగా రక్షణ చర్యలు అమలు చేయాలి.
పెండింగ్లో ఉన్న కేసులతో సహా చట్టబద్ధమైన యజమానులు, కార్మికులకు స్పష్టమైన, సరసమైన విధానాలను అందించాలి.
అమెరికా తన దేశీయ ప్రతిభతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ మేధస్సును జోడించడం ద్వారానే మరింత అభివృద్ధి సాధించగలదని, కాబట్టి శాస్త్రీయ నైపుణ్యాలు , పారిశ్రామిక ఆవిష్కరణలకు అమెరికా ఎప్పుడూ గమ్యస్థానంగా ఉండేలా తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రెసిడెంట్ ట్రంప్ను గోపియో కోరింది.








