CDK గ్లోబల్ అధ్యక్షుడిగా మరియు CEOగా హైదరాబాద్‌కు చెందిన సుధాకర్ రామకృష్ణ నియామకం
విజయవంతమైన సీడీకే పరివర్తనకు నాయకత్వం వహించిన తర్వాత రిటైర్ అవుతున్న బ్రియన్ మాక్‌డొనాల్డ్(Brian MacDonald) స్థానంలో బాధ్యతలు చేపట్టిన టెక్నాలజీ దిగ్గజం
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివిన రామకృష్ణకు ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, క్లౌడ్, నెట్వర్కింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాలలో దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన ఇటీవల ‘సోలార్‌విండ్స్’ (SolarWinds) సంస్థకు అధ్యక్షుడిగా మరియు CEOగా పనిచేశారు; అంతకుముందు పల్స్ సెక్యూర్ (Pulse Secure), సిట్రిక్స్ (Citrix), పాలికామ్ (Polycom), మోటరోలా (Motorola) మరియు 3కామ్ (3Com) వంటి సంస్థలలో ఉన్నత నాయకత్వ బాధ్యతలు నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబర్ 7, 2026: ప్రముఖ ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ అయిన సీడీకే, సుధాకర్ రామకృష్ణను ప్రెసిడెంట్ మరియు సీఈఓగా అలాగే సీడీకే(CDK) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడిగా అక్టోబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా ఇవాళ ప్రకటించింది. ఆయన బ్రియన్ మాక్‌డొనాల్డ్ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రిటైర్ అవుతున్న బ్రియన్ మాక్‌డొనాల్డ్.. బ్రూక్‌ఫీల్డ్(Brookfield) మరియు సీడీకేకు సీనియర్ స్ట్రాటజిక్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తూ, ప్రణాళికాబద్ధమైన ఈ మార్పు సమయంలో తగిన సహకారాన్ని, సలహాలను అందిస్తారు.
క్లౌడ్, మొబిలిటీ, నెట్వర్కింగ్, సెక్యూరిటీ మరియు కొలాబరేషన్ మార్కెట్లలో సాఫ్ట్వేర్ వ్యాపారాలను నిర్మించడంలో, అలాగే వాటిని విస్తరించడంలో దశాబ్దాల అనుభవమున్న నిపుణులైన ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ లీడర్ రామకృష్ణ. ఆయన ఇటీవల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ప్రముఖ ప్రొవైడర్ అయిన సోలార్‌విండ్స్(SolarWinds)కు ప్రెసిడెంట్ మరియు సీఈఓగా పనిచేశారు. అంతకు ముందు పల్స్ సెక్యూర్ (Pulse Secure) సంస్థకు నాయకత్వం వహించారు; అక్కడ ఆయన సంక్లిష్టమైన, అత్యంత కీలకమైన(మిషన్-క్రిటికల్) వాతావరణాలలో కస్టమర్లు మరియు భాగస్వాములతో కలిసి పనిచేశారు. అంతేకాకుండా ఆయన సిట్రిక్స్ (Citrix), పాలికాం(Polycom), మోటరోలా(Motorola), త్రీకామ్(3Com), యూఎస్ రోబోటిక్స్(U.S. Robotics) వంటి ప్రముఖ సంస్థలలో కూడా సీనియర్ లీడర్షిప్ బాధ్యతలను నిర్వర్తించారు.
“సీడీకేకు బ్రియన్ అందించిన నాయకత్వానికి మరియు ఆయన వేసిన శాశ్వత ముద్రకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆయన కీలకమైన తరుణంలో కంపెనీకి తిరిగి వచ్చి, సీడీకే వ్యూహం, ప్రొడక్ట్ రోడ్‌మ్యాప్ మరియు ఆర్థిక పునాదిని బలోపేతం చేసిన మల్టీ ఇయర్ ట్రాన్స్ఫర్మేషన్కు నాయకత్వం వహించారు” అని బ్రూక్‌ఫీల్డ్ ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్ మరియు సీడీకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్టర్ అయిన డగ్ బేయర్డ్(Doug Bayerd) తెలిపారు. “ఆ పునాదిని మరింత అభివృద్ధి చేయడానికి సుధాకర్ సరైన నాయకుడు. టెక్నాలజీ సంస్థలకు నాయకత్వం వహించడం, ఇన్నోవేషన్‌ను విస్తరించడం మరియు కస్టమర్-కేంద్రీకృత ఉత్పత్తులను వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవడంలో ఆయనకున్న అనుభవం.. సీడీకే దూసుకుపోవడానికి మరియు మారుతున్న ఆటోమోటివ్ రంగంలో కస్టమర్లు విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది”
పెట్టుబడుల మద్దతుతో తదుపరి వృద్ధి దశకు సిద్ధమైన సీడీకే.. తన ప్లాట్‌ఫారమ్‌ను పరిశ్రమలో అత్యుత్తమ సిస్టమ్ ఆఫ్ రికార్డ్ నుండి సిస్టమ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంగేజ్‌మెంట్‌గా మార్చడం కోసం గత కొన్ని సంవత్సరాలలో 500 మిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఆటోమోటివ్ రిటైల్‌లో టెక్నాలజీ మరింత కీలకమవుతున్న తరుణంలో, సీడీకే వద్ద ఉన్న ప్రత్యేకమైన ఆటోమోటివ్ డేటా.. కృత్రిమ మేధస్సు (AI), అనలిటిక్స్ మరియు కస్టమర్ ఇన్సైట్లకు బలమైన పునాదిని అందిస్తోంది. ఇందులో ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న చాలా మంది యూఎస్ కస్టమర్లు మరియు వాహనాలను ప్రతిబింబించే 257 మిలియన్ల యూనిక్ కస్టమర్ ఐడీలు కూడా ఉన్నాయి. ఈ అడ్వాంటేజ్ ద్వారా సీడీకే ఎలాంటి అంతరాయం లేకుండా కస్టమర్లు ఇప్పటికే నమ్ముకున్న వర్క్‌ఫ్లోలలో నేరుగా ఇంటెలిజెన్స్‌ను జోడించడానికి వీలు కల్పిస్తుంది.
“కస్టమర్లు తమ వ్యాపారాలను నిర్వహించడానికి నమ్ముకునే సొల్యూషన్స్ ద్వారా మరింత లబ్ది పొందేందుకు అవసరమైన సిబ్బంది, స్థాయి, నైపుణ్యం మరియు ఉత్పత్తి లోతు సీడీకే సొంతం” అని రామకృష్ణ తెలిపారు. “ఇన్నోవేషన్, క్రమశిక్షణతో కూడిన అమలు మరియు నమ్మదగిన డెలివరీ ద్వారా కస్టమర్లకు మరింత విలువను, విజయాన్ని అందించడమే మా ముందున్న అవకాశం. మా కస్టమర్లతో సమయం గడపడం, మా టీమ్‌లు మరియు భాగస్వాముల నుండి నేర్చుకోవడం, అలాగే పరిశ్రమ విశ్వాసాన్ని ప్రతిరోజూ చూరగొనే మా నిబద్ధతను ముందుకు తీసుకెళ్లడం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.








