డిసెంబర్ 18 నుంచి 20 వరకు ఒడిశాలో ఐఎస్ఎఫ్ స్టార్టప్ జాతర-2026
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని యువతలోనూ ఎన్నో వినూత్న ఆలోచనలు ఉన్నాయి. వాటిని డెవలప్ చేసేందుకు సరైన ఫండింగ్, మార్గదర్శకత్వం, మార్కెటింగ్ సపోర్ట్ లభిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. అలాంటి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎసఎఫ్) ముందుకొచ్చింది. ఒడిశాలోని గునుపూర్‌లో డిసెంబర్ 18 నుంచి 20 వరకు ‘ఐఎసఎఫ్ స్టార్టప్ జాతర-2026’ నిర్వహించనుంది. గ్రామీణ, గిరిజన యువతలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఐఎసఎఫ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ జేఏ చౌదరి తెలిపారు.
21 రాష్ట్రాల్లో పోటీలు.. 300 స్టార్టప్‌లు
జీఐఈటీ యూనివర్సిటీ సహకారంతో ఈ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. దేశంలోని 21 రాష్ట్రాల్లో ప్రస్తుతం ‘జూనికార్న’ పోటీలు జరుగుతున్నాయి. వాటిలో 300 స్టార్టప్‌లను ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. ఈ స్టార్టప్‌లు తమ ఆలోచనలు, డెమోలను నిపుణుల ప్యానెల్ ముందు ప్రదర్శిస్తాయి. దాదాపు ఎనిమిది దేశాల నుంచి ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) దేశాధినేతలు సైతం ఈ కార్యక్రమానికి వస్తారని ఆయన తెలిపారు.
24 మందికి ఫండింగ్
ఎంపికైన 300 స్టార్టప్‌లలో 24 మంది కంపెనీలకు నిధులు అందిస్తారు. వివిధ ఫండ్ హౌస్‌ల ఫండ్ మేనేజర్లు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ప్యానెళ్లు ఈ స్టార్టప్‌లను పరిశీలిస్తాయి. ఎంపికైన సంస్థలకు ఫండింగ్‌తోపాటు మెంటార్షిప్, మార్కెటింగ్‌లోనూ సహకారం అందిస్తారు. దీనికోసం ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చౌదరి వెల్లడించారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, వ్యవసాయం, మహిళా సాధికారత తదితర రంగాలకు సంబంధించిన స్టార్టప్‌లకు ఈ కార్యక్రమంలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ప్రకృతిలో ట్రెక్కింగ్.. స్టార్టప్‌లకు ప్రోత్సాహం
ఈవెంట్లో రెండో రోజు పాల్గొనేవారి కోసం దండకారణ్య అడవుల్లో ట్రెక్కింగ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ఎంటర్ప్రెన్యూర్లు, విద్యార్థులు, ప్రతినిధుల మధ్య నెట్వర్కింగ్, బాండింగ్ పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తు న్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నో విజయవంతమైన ఆవిష్కరణలు ఉన్నప్పటికీ, నిధులు, తగిన మద్దతు లేక కొన్ని ఆలోచనలు ముందుకు వెళ్లలేకపోతున్నాయని చౌదరి పేర్కొన్నారు. అలాంటి ఆవిష్కర్తలకు ఫండింగ్, మెంటార్షిప్, మార్కెట్ అనుసంధానం కల్పించడం ద్వారా అందర్నీ అభివృద్ధి లో భాగం చేయాలన్నదే ఐఎసఎఫ్ లక్ష్యమని తెలిపారు.
లక్ష మంది యువ ఇన్నొవేటర్లతో ‘జూనికార్న్ 100కె’
ఒకప్పుడు ఆవిష్కరణలు, అంకుర సంస్థలు (స్టార్టప్‌లు) కేవలం మహానగరాలకే పరిమితమని అనుకునేవారు. కానీ ఇటీవలి కాలంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని యువత సైతం అద్భుతమైన సాంకేతిక ఆవిష్కరణలతో ప్రపంచం దృష్టిని తమ వైపు తిప్పుకుంటున్నారు. గ్రామీణ విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూ, వారిని భావి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ‘ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన’ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యానికి అనుగుణంగా, దేశవ్యాప్తంగా లక్ష మంది యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించడమే ధ్యేయంగా ‘జూనికార్న్ 100కె’ ప్రాజెక్టును 2023లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8 ఏళ్ల పిల్లల నుంచి 25 ఏళ్ల యువతలోని నైపుణ్యాలను వెలికితీసి, స్థానిక సమస్యలకు వారే సాంకేతిక పరిష్కారాలు కనుగొనేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. భారత్ ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు ఈ యువత కొత్త పరిష్కారాలు వెతుకుతున్నారు. ఉదాహరణకు వ్యవసాయ రంగంలో 80 శాతం చిన్న సన్నకారు రైతులు తక్కువ దిగుబడితో, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీనివల్ల దేశానికి ఏటా సుమారు 92,651 కోట్ల రూపాయల నష్టం వస్తోంది. నిరుద్యోగం, డ్రగ్స్ వ్యసనం వంటి సామాజిక సమస్యలు కూడా సవాళ్లుగా మారుతున్నాయి. ఇటువంటి క్లిష్టమైన సమస్యలకు ‘జూనికార్న’ వేదికగా యువ ఆవిష్కర్తలు వినూత్న పరిష్కారాలను చూపుతున్నారు.
ఐడియా టు స్టార్టప్
కేవలం ఐడియాలను వినడం వరకే పరిమితం కాకుండా, విద్యార్థుల ఆలోచనలకు ప్రాణం పోసేలా ఐఎసఎఫ్ అడుగులు వేస్తోంది. హ్యాకథాన్లు, ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ల ద్వారా ప్రతిభావంతులను గుర్తించి, వారికి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, సీఈఓలు, అనుభవజ్ఞులైన మెంటార్లతో మార్గనిర్దేశం (మెంటార్షిప్) చేయిస్తున్నారు. అంతేకాకుండా వారి ప్రోటోటైప్లను పూర్తిస్థాయి స్టార్టప్‌లుగా మార్చేందుకు ఎంఎసఎంఈ పథకాలు, వెంచర్ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారుల ద్వారా నిధులు సమకూర్చేందుకు కూడా ఐఎసఎఫ్ సహకారం అందిస్తోంది. భారత టెక్ పరిశ్రమలో కీలక పాత్ర పోషించిన ఐఎసఎఫ్ వ్యవస్థాపకులు డాక్టర్ జె.ఎ. చౌదరి, కో-ఫౌండర్లు డాక్టర్ శివ మహేష్ తంగుటూరు, ఎం. సత్యేంద్ర కుమార్, డాక్టర్ వర్ల భాను ప్రకాష్ రెడ్డి తదితర ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ వేదిక వేగంగా విస్తరిస్తోంది. సామాజిక పారిశ్రామికవేత్త, వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు మధుసూదన్ సాయి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది.
విద్యార్థుల అద్భుత ఆవిష్కరణలు
ఈ జూనికార్న్ వేదిక ద్వారా వెలుగులోకి వచ్చిన ఎంతో మంది విద్యార్థులు తమ అద్భుతమైన ప్రాజెక్టులతో ఔరా అనిపిస్తున్నారు. వేద్ మన్యం (హైదరాబాద్): కేవలం 15 ఏళ్ల వయసున్న వేద్…ఎనఇఆర్డి అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లెర్నింగ్ కంపానియన్ యాప్‌ను రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ముడుంబి వెంకట శేష: రహదారి భద్రతను మెరుగుపరిచే దిశగా ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ సెన్సార్లతో కూడిన స్మార్ట్ హెల్మెట్ ను అభివృద్ధి చేశాడు.
నిఖిల్ భార్గవ్ (తోటపల్లి): హీల్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న నిఖిల్.. భద్రతను కల్పించే ‘స్మార్ట్ ప్రొటెక్షన్ బ్యాండ’ ను ఆవిష్కరించాడు.
కృషి యంత్ర: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం సాయి వివేక్ తన స్నేహితులతో కలిసి స్మార్ట్ వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేస్తున్నాడు.
నృతి తాయి: 6వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి Gశ్రీucశ్పుీష్ట్రaతీఎ పేరుతో హెల్త్ మానిటరింగ్ స్టార్టప్ మొదలుపెట్టాడు. కంపెనీ ఫౌండర్/సీఈఓగా చిన్న వయసులోనే భారీ సక్సెస్ సాధించాడు.
వీరితో పాటు నయన్ అనే విద్యార్థి ఈ-వేస్ట్ నిర్వహణకు పరిష్కారం కనుగొనగా.. స్వచ్ఛమైన తాగునీటి ప్రాజెక్టుపై అబ్దుల్ పనిచేస్తున్నాడు. కెమిస్ట్రీ ప్రయోగాలను సులభతరం చేసేందుకు సమన్యు సత్యమూర్తి మై కెమ్ ల్యాబ్ ప్రాజెక్టును స్టార్ట్ చేశాడు. స్మార్ట్ హీల్ పేరుతో ఏఐ ఫస్ట్ ఎయిడ్ సపోర్ట్‌ను రియా అనే అమ్మాయి తయారు చేసింది. ఇలా ఎందరో విద్యార్థులు విశేషమైన ప్రాజెక్టులతో అందర్నీ ఆకట్టుకున్నారు.
ఒడిశా ఆవిష్కర్తలకు జూనికార్న్ అండ
గ్రామీణ యువతలో దాగివున్న ప్రతిభను వెలికితీసి, వారి ఆలోచనలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ పనిచేస్తోంది. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన యువ ఆవిష్కర్తలను ప్రోత్సహిం చేందుకు కూడా జూనికార్న్ చొరవ తీసుకుంటోంది. స్థానికంగా ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారి ఆలోచనలను వినూత్న పరిష్కారాలుగా, భవిష్యత్తులో స్టార్టప్‌లుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మార్గదర్శకత్వం అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఒడిశా యువత కోసం ప్రత్యేకంగా త్వరలోనే ఆ రాష్ట్రంలో కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.
31న ‘కోహోర్ట్ 3.0’
గత సమ్మిట్ల అపూర్వ విజయాల స్ఫూర్తితో, గ్రామీణ ప్రాంతాల్లోని యువత ఆశయాలకు, ప్రపంచ స్థాయి అవకాశాలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాలనే ఉన్నత లక్ష్యంతో ఐఎసఎఫ్ మరో బృహత్తర కార్యక్రమానికి సన్నద్ధమైంది. అదే “జూనికార్న్ రూరల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ – కోహోర్ట్ 3.0”. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఈ నెలాఖరున, అక్టోబర్ 31న అట్టహాసంగా జరగనుంది. ఈ కోహోర్ట్ 3.0 ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 20కి పైగా రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులైన యువ ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. విద్యార్థులు కేవలం ఐడియాలు ఇవ్వడమే కాకుండా, వారి అద్భుతమైన ఆలోచనలను వాణిజ్యపరంగా లాభదాయకమైన స్టార్టప్ వెంచర్లుగా మార్చేలా పూర్తి స్థాయి సాధికారతను అందించనున్నారు.
ప్రపంచ ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మారడానికి భారతదేశం ఒక కీలకమైన తరుణంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా.. అందులో 65% గ్రామీణ ప్రాంతాలలో ఉండటంతో, వారి సామర్థ్యాన్ని వెలికితీయడానికి, సమ్మిళిత, సాంకేతికత ఆధారిత వృద్ధిని సాధించడానికి మనకు అపూర్వమైన అవకాశం ఉంది.
భారత్ 2047ను సాకారం చేసుకోవాలంటే, మనం యువతకు ముఖ్యంగా గ్రామీణ భారతదేశం.. టైర్ 2 & 3 నగరాల నుండి సరైన సాధనాలు, మార్గదర్శకత్వం మరియు ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించాలి. ఐఎసఎఫ్ జూనికార్న100కే అనేది క్రమబద్ధమైన శిబిరాలు, ప్రత్యక్ష మార్గదర్శకత్వం మరియు అంతర్జాతీయ అవకాశాల ద్వారా లక్ష మంది ఆవిష్కర్తలకు సాధికారత కల్పించే ఒక విప్లవాత్మక ఉద్యమం.
ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు.. ఇదొక విప్లవం.
భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మాతో చేరండి!
డాక్టర్ జె. ఎ. చౌదరి
వ్యవస్థాపకులు & ఛైర్మన్
అంతర్జాతీయ స్టార్టప్ ఫౌండేషన్








