ప్రధాని మోదీ 25 ఏళ్లు అధికార ప్రస్థానం
భారతీయ రాజకీయ చదరంగంలో సూపర్ హీరో ప్రధాని మోడీ.. వరుసగా 25 ఏళ్లుగా అధికారం ఆయనను అంటిపెట్టుకునే ఉంది. సాదారణంగా ఓదఫా గెలిచిన వారు.. రెండోసారి ప్రజా వ్యతిరేకతతో ఓడిపోతుంటారు. దీనికి అతిరథ మహారధులు సైతం అతీతులేమీ కాదు.. కానీ వీటన్నింటినీ పక్కన పడేసి.. నరేంద్రమోడీ నాన్ స్టాప్ విజయాలు అందుకుంటూ వస్తున్నారు. 2001 అక్టోబరు 7వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదలైన ఆయన ప్రస్థానం.. అప్రతిహతంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 ఏళ్ల అధికార ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నరేంద్రమోడీ.. బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం నింపే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప్ సభలో ఈ మేరకు మాట్లాడారు. “ప్రజల ఆశీర్వాద బలమే నన్ను ఇంతకాలం నడిపించింది. గుజరాత్ సీఎంగా ప్రమాణం చేసినప్పుడు ఇంతగా ఆలోచించలేదు. 25 ఏళ్లుగా నిరంతర ప్రజాసేవ అందిస్తానని నాడు ఊహించలేదు. ఆశీస్సులు అందించిన దేశ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నన్ను ఇంతగా ఆదరిస్తోన్న ప్రజలను ఎన్నటికీ మర్చిపోలేను. ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో దేశానికి మరింత సేవ చేస్తా. ప్రజా సేవలో ఏనాడూ వెనుదిరగనన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది మద్దతుగా నిలిచారు. ప్రజా సేవలో ఉన్నప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకుంటే.. ముందుకు వెళ్లలేం. నేను నిరంతర విద్యార్థిని” అని మోడీ మాట్లాడారు.
వికసిత్ భారత్ గురించి మోడీ ప్రస్తావించారు. “2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించి తీరుతాం. ఆత్మనిర్భర్ భారత్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సాధ్యమే. అంతరిక్షంలో అడుగుపెట్టడం, ఒలింపిక్స్ నిర్వహణ.. ఇలాంటివన్నీ సాధ్యమే. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. దేశాభివృద్ధికి ఇదే మంచి సమయం. నూతన చరిత్ర లిఖించే సమయం ఆసన్నమైంది. అన్ని రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ఇదే సమయం. సమస్యలు ఉంటే.. పరిష్కారం కూడా దాని వెంటే ఉంటుంది. సంకల్ప బలం ఉంటే దేనినైనా సాధించవచ్చు. 25 ఏళ్లు అంటే ఒక విజయంగానే కాదు.. సేవగానూ భావిస్తాను. ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు ఎప్పటికీ అలసిపోను.” అని వ్యాఖ్యలు చేశారు. “ఇప్పుడు ప్రపంచమంతా మన దేశ పైలట్ స్మిత్ మచ్చర్పైనే చర్చ జరుగుతోంది. భారతీయ పైలట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఒక రోజు భారత్‌లో తయారైన విమానం గురించి భారత్ మాట్లాడుతుంది. దేశ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలియజెప్పే సమయం ఎంతో దూరంలో లేదు. దేశం అభివృద్ధి దిశలో పరుగులు పెడుతోంది. దానిని ఎవరూ ఆపలేరు.” అని దేశ సైనిక సామర్థ్యాలను కొనియాడారు. ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు బీజేపీ, రాజకీయ సహచరులు, తనపై విశ్వాసం ఉంచిన ప్రజలందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వేల ఏళ్ల చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న దేశానికి సేవ చేసే అవకాశం తనకు లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాన న్నారు. 25 ఏళ్ల ప్రస్థానం కేవలం గతాన్ని గుర్తుచేసుకునే సందర్భం కాదని.. భవిష్యత్తు కోసం సంకల్పాన్ని పునరుద్ఘాటించే సమయమని మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తామని, ప్రపంచంలోని టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. “మనం సాధిస్తాం.. తప్పకుండా సాధిస్తాం” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
మోదీ ఈ 25 ఏళ్లలో సాధించిన విజయాలెన్నో..
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ అధికారం చేపట్టిన సమయంలో ఆ రాష్ట్రం భుజ్ భూకంపంతో అతలాకుతలమై ఉంది. దానినే అవకాశంగా మలుచుకుని ఆయన పునర్నిర్మాణం చేపట్టారు. 2003లో వైబ్రెంట్ గుజరాత్ పేరుతో రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చారు. 2002, 2007, 2012లలో గుజరాత్లో భాజపాను అధికారంలోకి తెచ్చి సుదీర్ఘ కాలం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు సాధించారు. గుజరాత్ మోడల్ పేరుతో ఆయన తెచ్చిన విధానం అందరినీ ఆకట్టుకుంది. 2014 ఎన్నికలకు ముందు ఆడ్వాణీని కాదని ప్రధాని అభ్యర్థిగా మోదీని భాజపా ప్రకటించింది. ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించి అధికారం చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అపజయం లేకుండా ఆ కూటమి అధికారంలో ఉందంటే అది మోదీ చలవే. ఆయనకున్న ప్రజాదరణ, ఆకట్టుకునే వాగ్ధాటి, క్షేత్ర స్థాయిలో మమేకం వంటివి ఆయనను అత్యున్నత నేతగా నిలబెట్టాయి. మోదీ అధికార యాత్ర 25 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన ప్రభుత్వం ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో విడుదల చేసిన ఆ పుస్తకంలో 25 ఏళ్లలో 25 సవాళ్లను, వాటిని అధిగమించిన తీరును వివరించింది.
2001లో మోదీ అధికారం చేపట్టే సమయానికి కచ్‌లో భారీ భూకంప విధ్వంసం, మూడేళ్ల కిందటి తుపాను బీభత్సం, వరుసగా మూడో ఏడాది కరవు, సహకార బ్యాంకుల వైఫల్యం తీవ్రంగా ఉన్నాయి. ఎటువంటి పాలనానుభవం లేని ఆయన నేరుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. వెంటనే రంగంలోకి దిగారు. క్షేత్ర స్థాయికి సీనియర్ అధికారులను పంపించి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుని కచ్ ప్రాంతాన్ని పునర్నిర్మించారు. బ్యాంకులను గాడిలో పెట్టారు. వ్యవసాయాభివృద్ధిని పరుగులు పెట్టించారు. జాతీయ వృద్ధి 2.9 శాతం ఉండగా గుజరాత్ వృద్ధిని 9.6 శాతానికి చేర్చారు.
పాకిస్థాన్‌తో తీర ప్రాంత సరిహద్దు ఉండటంతో ఆ రాష్ట్రానికి ఉగ్ర ముప్పు అధికంగా ఉండేది. 2008 జులైలో అహ్మదాబాద్‌లో 21 బాంబులు పేలాయి. ఈ నెట్‌వర్క్‌ను ఛేదించడంతో అనేక రాష్ట్రాల్లో బాంబు దాడులకు కుట్ర బయటపడింది. ఆ తర్వాత పోలీసు భద్రతను మరింత పెంచడంతోపాటు నిఘా చర్యలను పటిష్ఠం చేయడంతో ఉగ్రదాడులు తగ్గాయి. ఏళ్లపాటు కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలు కరవుతో అల్లాడుతుంటాయి. ఇక్కడి మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. 1961లో శంకుస్థాపన చేసిన నర్మద డ్యాం 40 ఏళ్లయినా పూర్తి కాలేదు. మోదీ వచ్చాక 1.8 లక్షల చెక్ డ్యాంలు కట్టించారు. పైపులైన్లు వేశారు. నర్మద డ్యాంను పూర్తి చేసి 9,000 గ్రామాలకు, 170 పట్టణాలకు నీరిచ్చారు. 2006లో వచ్చిన వరదలు సూరత్‌లో 95 శాతం ప్రాంతాలను ముంచేశాయి. వజ్రాలు, వస్త్రాల పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి చేపట్టిన చర్యలతో 2023 నాటికి సూరత్ దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. 2002లో జరిగిన మత ఘర్షణల తర్వాత మోదీపై అనేక ఆరోపణలొచ్చాయి. గుజరాత్ అభివృద్ధిపైనా విమర్శలొచ్చాయి. అయినా 2007, 2012లలో ఆయనను రాష్ట్ర ప్రజలు గెలిపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా మోదీ నేతృత్వంలో భాజపా పూర్తి మెజారిటీ సాధించింది. అంతకుముందు 30 ఏళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాలే కొనసాగాయి. 9 నెలల్లో 400 ర్యాలీలు, 3 లక్షల కిలోమీటర్లు తిరిగిన మోదీ తన పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించి పెట్టారు. భాజపా 282 సీట్లు గెలుచుకుంది.
2013లో భారత్‌పై బలహీన ఆర్థిక వ్యవస్థ ముద్ర పడింది. అప్పట్లో ద్రవ్యోల్బణం రెండంకెల్లో ఉంది. ద్రవ్యలోటు భారీగా ఉంది. రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. మోదీ హయాంలో తీసుకున్న చర్యలతో ఆ తరువాత 5 సంక్షోభాలను తట్టుకుని దేశం వృద్ధి దిశగా పయనిస్తోంది. సులభతర వాణిజ్యంలో 2014 నాటికి భారత్ 142వ స్థానంలో ఉంది. జీఎస్టీ, ప్రత్యేక రవాణా కారిడార్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, డిజిటల్ అనుమతులతో వాణిజ్యాన్ని సులభతరం చేయడంతో 2020 నాటికి భారత్ 63వ స్థానానికి ఎగబాకింది. బ్యాంకులకు గుర్తింపు, పరిష్కారం, మూలధన పునఃసమీకరణ, సంస్కరణలతోపాటు ఫోన్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకింగ్ రంగం సమూలంగా మారిపోయింది.
సరకు రవాణా రైళ్ల సగటు వేగం గతంలో గంటకు 24 కిలోమీటర్లుగా ఉండేది. ప్రయాణికుల రైళ్ల కోసం ఎక్కడికక్కడ గూడ్స్ రైళ్లను ఆపేవారు. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక సరకు రవాణా కారిడార్ల నిర్మాణంతో వాటి వేగం పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంవల్ల దిగుమతులపై ప్రభా వం పడినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లోటు లేకుండా ప్రభుత్వం చూడగలిగింది. ఆపరేషన్ గంగా ద్వారా 22,500 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. హర్మూజ్ జల సంధిని మూసివేయడంతో చమురు దిగుమతులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. అయినా వెరవకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును తెప్పించి లోటు లేకుండా చూడగలిగింది.








