కేతిరెడ్డికి షాక్ ఇచ్చిన పోలీసులు..!
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణలకు వేదికవుతోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో ఈ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారనే ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో(Kethireddy) పాటు పలువురు వైసీపీ శ్రేణులపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం సందర్భంగా ధర్మవరం మున్సిపల్ కార్యాలయం సమీపంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకోవడంతో కొందరు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. గాయపడిన తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రభుత్వాసుపత్రి నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
కూటమి నేతలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మరియు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసులు ఎటువంటి ర్యాలీలకు ముందస్తు అనుమతి ఇవ్వలేదు. నిబంధనలను ఉల్లంఘించి, ఎలాంటి పర్మిషన్ లేకుండా జనాన్ని సమీకరించి ర్యాలీ నిర్వహించడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణలో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఆయన మద్దతుదారులపై పలు నిబంధనల ఉల్లంఘన సెక్షన్ల కింద ధర్మవరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదుపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైసీపీ అభ్యర్థులపై, నేతలపై దాడులు చేయిస్తోందని ఆరోపించారు. తమ పార్టీ శ్రేణులపై దాడులు చేసిన వారిని వదిలేసి, బాధితుల పక్షాన నిలబడిన తనపైనే అక్రమంగా కేసులు పెట్టడం దారుణమన్నారు. పోలీసుల ఏకపక్ష వైఖరి వీడకపోతే నిరసనలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.








