ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ 80 కోట్ల లెక్క వెనుక అసలు కథ ఏంటి?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
చదువు అయిపోవాలి.. మంచి కంపెనీలో జాబ్ రావాలి.. నెలనెలా శాలరీ పడాలి.. లైఫ్ సెటిల్ కావాలి! చాలామంది యువతకు ఇదే ప్లాన్. కానీ ఒక్కసారి జాబ్ మార్కెట్ వైపు చూడండి. డిగ్రీలు చేతిలో పట్టుకుని ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నవాళ్లు లక్షల్లో ఉన్నారు. పోటీ రోజురోజుకీ పెరుగుతోంది. ఇలాంటి టైమ్లో రాబోయే రోజుల్లో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉండబోతోంది? అసలు మనం చదివిన చదువుకు తగిన జాబ్ దొరుకుతుందా? లేక ఎన్ని అప్లికేషన్లు పెట్టినా వెయిటింగ్ లిస్టులోనే ఉండిపోవాలా? ప్రపంచ బ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు అజయ్ బంగా చేసిన తాజా హెచ్చరిక ఇప్పుడు ఈ ప్రశ్నలనే తెరపైకి తెచ్చింది.
120 కోట్ల మంది యువత.. ఉద్యోగాల లెక్కలు చూస్తేనే టెన్షన్!
అజయ్ బంగా చెప్పిన లెక్కల ప్రకారం.. రాబోయే 10 నుంచి 15 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 కోట్ల మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి రానున్నారు. అంటే ఇంతమంది తమ కెరీర్ను ప్రారంభించడానికి, సంపాదన మొదలుపెట్టడానికి ఉద్యోగాల కోసం ప్రయత్నించబోతున్నారు. కానీ అదే సమయంలో కొత్తగా అందుబాటులోకి వచ్చే ఉద్యోగాలు మాత్రం సుమారు 40 కోట్లేనని అంచనా.
అంటే… ఉద్యోగం కావాలని ఎదురుచూసేవాళ్లు భారీ సంఖ్యలో ఉంటే.. కొత్తగా వచ్చే ఉద్యోగాలు మాత్రం అందులో కొంతమందికే సరిపోతాయి. మిగిలినవాళ్ల పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి గురించి ఆందోళన పెంచుతోంది. అయితే, ఇది ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయినవారి లెక్క కాదు. భవిష్యత్తులో ఉద్యోగ మార్కెట్లోకి వచ్చే యువత సంఖ్యకు, అంచనా వేస్తున్న కొత్త ఉద్యోగాలకు మధ్య ఉన్న అంతరం.
జాబ్ మార్కెట్లో ఇంత టెన్షన్ ఎందుకు?
ఉద్యోగాలు సృష్టించాలంటే కంపెనీలు కొత్తగా పెట్టుబడులు పెట్టాలి. వ్యాపారాలను విస్తరించాలి. కొత్త పరిశ్రమలు రావాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు కంపెనీలకు అంత ఈజీగా లేవు. యుద్ధాలు, దేశాల మధ్య ఉద్రిక్తతలు, పెరుగుతున్న అప్పులు, ఇంధనం వంటి వస్తువుల ధరలు వ్యాపారాలపై ఒత్తిడి పెంచుతున్నాయి.
కంపెనీలకు ఖర్చులు పెరిగితే కొత్త ఉద్యోగులను నియమించుకునే విషయంలోనూ ఆలోచించాల్సి వస్తుంది. ప్రభుత్వాల దగ్గర కూడా అభివృద్ధి కోసం ఖర్చు చేయడానికి పరిమితమైన నిధులే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలను పెద్ద సంఖ్యలో సృష్టించడం పెద్ద సవాలుగా మారుతోంది.
ఏఐ వచ్చేసింది.. మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి?
ఇప్పటికే జాబ్ కోసం ప్రయత్నిస్తున్న యువతకు మరో పెద్ద ప్రశ్న ఏఐ రూపంలో ఎదురవుతోంది. ఒకప్పుడు ఫ్రెషర్స్ చేసే కొన్ని పనులను ఇప్పుడు ఏఐ టూల్స్తో వేగంగా చేయగలుగుతున్నారు. కంపెనీలు కూడా టెక్నాలజీని ఉపయోగించుకుని తమ పనులను మార్చుకుంటున్నాయి.
అయితే, ఏఐ వల్ల ఉద్యోగాలన్నీ పోతాయని చెప్పలేం.
కొత్త రకాల ఉద్యోగాలు కూడా రావచ్చు. కానీ ఉద్యోగాల స్వరూపం మారుతున్నప్పుడు యువత నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు కూడా మారతాయి. కేవలం డిగ్రీ ఉందని కాకుండా, కొత్త టెక్నాలజీని ఉపయోగించగలగడం, సమస్యలను పరిష్కరించడం, వాస్తవ పరిస్థితుల్లో పని చేయగలగడం వంటి సామర్థ్యాలకు ప్రాధాన్యం పెరగవచ్చు. రాబోయే రోజుల్లో ఉద్యోగాలు ఎలా మారతాయన్నది ఈ మార్పుల వేగం, కంపెనీల అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?
ప్రపంచ బ్యాంకు గత మూడేళ్లుగా రెండు అంశాలపై దృష్టి పెట్టిందని అజయ్ బంగా తెలిపారు. పరిమితంగా ఉన్న డబ్బును సమర్థంగా వినియోగించడం, అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించేందుకు దేశాలకు సహకరించడం ఈ రెండింటిలో ముఖ్యమైనవి.
అంటే ప్రభుత్వాలు కేవలం అభివృద్ధి కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేయడం మాత్రమే కాకుండా, ఆ పెట్టుబడుల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయన్నదానిపైనా దృష్టి పెట్టాలి. కొత్త పరిశ్రమలను ప్రోత్సహించడం, వ్యాపారాలకు అవకాశాలు కల్పించడం, యువతకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం కూడా కీలకమే.
భారత్ వంటి యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశాలకు ఈ విషయం మరింత ముఖ్యం. చదువు పూర్తిచేసుకున్న యువతకు తగిన ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు పెరగాలి. కంపెనీలు నియామకాలు చేపట్టాలి. యువత నేర్చుకున్న నైపుణ్యాలకు, మార్కెట్లో ఉన్న అవసరాలకు మధ్య అంతరం తగ్గాలి.
చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. డిగ్రీ సంపాదించడం కెరీర్లో ఒక స్టెప్ మాత్రమే. మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా అవసరమే. అదే సమయంలో యువత తమ ప్రయత్నాలతోనే అన్నీ సాధించాలనడం సరిపోదు.. వారికి తగిన ఉద్యోగాలు సృష్టించే బాధ్యత ప్రభుత్వాలు, పరిశ్రమలపైనా ఉంటుంది.








