కర్నూలు మేయర్ పీఠానికి అత్తా కోడళ్ల పోరు..!
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల సమరం నడుస్తున్న వేళ కర్నూలు నగరపాలక సంస్థ (KMC) మేయర్ ఎన్నికల్లో ఒక ఊహించని ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. ప్రతిష్టాత్మకమైన కర్నూలు మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన మహిళా అభ్యర్థులు వరసకు అత్తా కోడళ్లు కావడం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజకీయ ప్రత్యర్థులుగా మారిన ఈ ఇద్దరు మహిళల మధ్య జరగబోయే ఎన్నికల పోరుపై ఓటర్లలో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ఈ ఎన్నికల పోరులో అధికార కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా బొల్లెద్దుల విజయ ప్రత్యూష బరిలో నిలిచారు. అదే సమయంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) తరఫున మేయర్ రేసులో యు. సుశీలమ్మ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. వీరిద్దరూ వరసకు అత్తా కోడళ్లు కావడంతో ఈ పుర పోరు కాస్తా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళల మధ్య రాజకీయ సమరంగా రూపాంతరం చెందింది. బంధుత్వాలు ఎలా ఉన్నప్పటికీ, ఎన్నికల రణరంగంలో మాత్రం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల గెలుపు కోసమే ఇద్దరూ వ్యూహప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ పదవి ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో రెండు పార్టీలు కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాయి. ఈ క్రమంలోనే అటు టీడీపీ అభ్యర్థి విజయ ప్రత్యూష ఇప్పటికే స్థానిక మంత్రి టీజీ భరత్తో భేటీ అయి ప్రచార వ్యూహాలపై వేగం పెంచారు. ఇటు వైసీపీ నుంచి సుశీలమ్మ కూడా ముమ్మరంగా పావులు కదుపుతున్నారు. కుటుంబ బంధాలను పక్కన పెట్టి, రాజకీయ ప్రత్యర్థులుగా తలపడుతున్న ఈ అత్తా కోడళ్లలో కర్నూలు మేయర్ పీఠం ఎవరిని వరించనుందో చూడాలి.








