టీడీపీ, వైసీపీలపై వైఎస్ షర్మిల నిప్పులు..!
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మున్సిపల్, స్థానిక సంస్థల(Local Elections) ఎన్నికల వేళ చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి(Ys Sharmila) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండు కలిసి దాష్టీక రాజకీయాలు సాగిస్తున్నాయని మండిపడ్డారు. నాడు వైసీపీ హయాంలో హింసాకాండ నడిస్తే, నేడు టీడీపీ హయాంలో అంతకుమించిన ఘోరకలి నడుస్తోందని, ఈ ప్రతీకార రాజకీయాల వల్ల రతనాల సీమ కాస్తా రక్తసీమగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్న రాయచోటి, పుంగనూరు నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న భీకర ఘర్షణలు, దాడులు రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అత్యంత ఆందోళనకరమైన పరిణామాలని ఆమె పేర్కొన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ను మరో సౌత్ బీహార్గా మార్చే పరిస్థితులను ఈ రెండు పార్టీలు సృష్టిస్తున్నాయని షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు రాజకీయాలకు, రక్తపాతానికి తావులేదని, రాజకీయాలు అంటే ప్రజల అభివృద్ధి కోసం పోటీ పడాలి కానీ ఇలా భౌతిక దాడులకు పాల్పడటం కాదని హితవు పలికారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పవిత్ర పాలన అని చెప్పుకుంటున్నారని, మరి నిజంగా పవిత్ర పాలనే అయితే ఈ దాడులు, బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల అడ్డగింతలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఐదు అంచెల భద్రత ఉండాల్సిన నామినేషన్ కేంద్రాల వద్ద కిరాయి రౌడీలు, గూండాలు స్వైరవిహారం చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని, అధికార పార్టీకి అండగా నిలుస్తున్న పోలీసు శాఖ బాధ్యత ఏమైందని ఆమె నిలదీశారు.








