ఆలోచింపజేసే కుటుంబ కథాచిత్రం ‘3 2 1’.. అక్టోబర్ 23న గ్రాండ్ రిలీజ్!
ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? జీవితాంతం సాగే వైవాహిక బంధానికి ఏది ఉత్తమం? అనే ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం వెతుకుతూ తెరకెక్కిన చిత్రం ‘3 2 1’ (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్డ్ మ్యారేజ్). ఈ నెల 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కొన్ని సినిమాలు కేవలం వినోదాన్ని అందించి ముగిసిపోతే.. మరికొన్ని చిత్రాలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతూ, ఆలోచింపజేస్తుంటాయి. అలాంటి ప్రత్యేకమైన చిత్రాల కోవలో ‘3 2 1’ నిలుస్తుందని చిత్ర రచయిత, దర్శకుడు, సహ నిర్మాత చిలుముల శాంతికుమార్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను రూపొందించిన మూడు చిత్రాల్లో రెండు నంది అవార్డులను అందుకున్న శాంతికుమార్.. ఈ సినిమాను పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా కుటుంబ సమేతంగా ఎలాంటి ఇబ్బంది, ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చూడగలిగేలా స్వచ్ఛమైన కథాంశంతో తెరకెక్కించినట్లు తెలిపారు.
ప్రేమ వివాహం, పెద్దలు కుదిర్చిన వివాహం.. ఈ రెండింటిలో జీవితాంతం సాగే ప్రయాణానికి ఏది సరైన ఎంపిక? అనే ఆసక్తికరమైన అంశాన్ని ఈ చిత్రం ప్రధానంగా చర్చించనుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల విడుదలైన ‘నను తాకిన’ మెలోడీ గీతం అతి తక్కువ సమయంలోనే లక్షలాది మంది హృదయాలను తాకగా.. రెండు రోజుల క్రితం విడుదలైన అధికారిక ట్రైలర్ కూడా డిజిటల్ వేదికలపై మిలియన్ వ్యూస్‌ను దాటి విశేష స్పందనను సొంతం చేసుకుంది.
ఈ చిత్రంలో పలు ప్రముఖ వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న మోహిత్ పెద్దాడ హీరోగా నటిస్తుండగా, నాని నటించిన విజయవంతమైన చిత్రం ‘ప్యారడైజ్’లో జూనియర్ సమ్మక్క పాత్రతో ప్రశంసలు అందుకున్న లావణ్య కథానాయికగా నటిస్తున్నారు. వివాన్ సూర్య, ప్రభావతి, మాధవి, లక్ష్మీ వెన్నెల, యామిని, కుంతి శ్రీనివాస్, అప్పాజీ అంబరీష, విద్యాసాగర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై వంగపాటి రామానుజ రెడ్డి, చిలుముల శాంతికుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాయ్ కాల్విన్ సంగీతాన్ని సమకూర్చగా, ప్రముఖ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ పాటలకు సాహిత్యాన్ని అందించారు. శివ ముప్పాల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, శివ శర్వాణి ఎడిటర్‌గా, నానిబాబు సహ దర్శకుడిగా వ్యవహరించారు. టైటిల్, పోస్టర్ డిజైనర్‌గా వివా రెడ్డి పనిచేశారు.
ప్రస్తుతం కథాబలమున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, తమ ‘3 2 1’ చిత్రం కూడా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రేమ వివాహం, పెద్దలు కుదిర్చిన వివాహం మధ్య ఉన్న తేడాలు, భావోద్వేగాలు, కుటుంబ బంధాలను ప్రతిబింబించే ఈ చిత్రం అక్టోబర్ 23న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.








