అసంభవామి యుగేయుగే
—రావి కొండలరావు
మరగకుండానే పొంగుతున్న పాల సముద్రం మీద ఆదిశేషుడు శయనించి వున్నాడు. ఆ శేషుడి పడగ కింద చీకు చింతా లేకుండా కాళ్లు బార జాచుకుని శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నాడు.
ఆయన సతీమణి ఆదిలక్ష్మి కాళ్లు వత్తుతూ దీక్షాతత్పరురాలై కూచుని వుంది. అసలు, మహావిష్ణువు ఎక్కడికీ వెళ్లడు, ఎక్కడా తిరగడు. వెళ్లినా గరుడపక్షి మీద ఆకాశంలో రివ్వున ఎగురుతాడు. లేదా, అక్కడ మాయమై ఇంకోచోట టక్కున ప్రత్యక్షమవుతాడు. మరి, రోజూ క్రోసుల కొద్దీ యోజనాల కొద్దీ తిరిగినట్టు ఆయనకు నిత్యం కాళ్లెందుకు సలుపుతాయో, పీకుతాయో అర్థంకాదని లక్ష్మీదేవి అనుకోకపోయినా, ఆదిశేషుడు అనుకుంటూ వుంటాడు.
పాల సముద్రపు చల్లని ఘోష తప్ప, ఇంకే శబ్దమూలేదు. శ్రీ మహావిష్ణువు ఉన్నట్టుండి ఉలిక్కిపడినట్టుగా దిగ్గున లేచి కూచున్నాడు. లక్ష్మీదేవి కంగారుపడింది. “ప్రాణేశ్వరా! ఏం జరిగింది? కలగన్నారా? లేక ఏ భక్తుడి మొరయినా వినిపించిందా?’ అని అడిగింది.
“లేదు. అలాంటి భక్తులు ఇప్పుడెక్కడున్నారు గానీ, ద్వాపర యుగం గుర్తు కొచ్చింది. కృష్ణావతారం గుర్తుకొచ్చింది” అన్నాడు చిరునవ్వుతో శేషశయనుడు.
“ఓహో! ఇన్నేళ్లయిన తర్వాత, మళ్లీ కృష్ణమూర్తి మెదిలాడంటే, ఏదో ఆలోచన వచ్చిందన్నమాటే. మీకేమండీ వెంటనే ఆ అవతారం దాల్చి, వేలాదిమంది గోపికల వెంటబడండి” అన్నదామె ఓరకంట చూస్తూ.
“నీ ఆలోచన అది. నేను కృష్ణావతారంలోనే నరకాసురుడిని చంపాను. అతని మరణాన్ని శ్లాఘిస్తూ ప్రజలంతా దీపావళి పేరిట ఘనంగా వేడుకలు చేస్తారు. ఈరోజే దీపావళి. అందుకనే ఆ అవతారం గుర్తొచ్చింది”.
“అవునూ సత్యభామట గదా, ఆ రాక్షసుణ్ణి వధించింది!”
“కొందరు అలా అంటారు, కొందరు నేనేనంటారు. ఎవరైనా ఏమైనా, చేయించిన వాడిని నేనే గదా”
“చంపింది సత్యభామే అయి వుంటుంది లెండి. ఆ ఘనత స్త్రీకి ఇవ్వడం ఇష్టం లేక, మీదేనని చాటుకుంటున్నారు.
“పోనీ, సత్యభామనే అడుగు ఏం చెబుతుందో” అని మహావిష్ణువు ఆమెను పిలిచాడు. శూన్యంలోంచి సత్యభామ, రూపం పోసుకుని దిగి వచ్చింది. మహావిష్ణువు శ్రీకృష్ణరూపంలో కనిపించాడు. “స్వామీ” అందామె ఆనందంగా.
“మరేం లేదు సత్యా ఆనాడు నరకుడిని చంపింది నువ్వా నేనా అని అనుమానం వచ్చింది. అందుకని పిలిచాను”
“ఇద్దరమూ కలిసే వధించాము స్వామీ. మీరు అలిసిపోయినప్పుడు నేనూ, నేను అలసినప్పుడు మీరూ బాణాలు వేశాము. ఏమైనా కారకులు మీరేగా స్వామీ! అందుకే గదా, దీపావళి నాటి పూజలన్నీ మీకే అందుతున్నాయి. నా పేరెవరు చెప్పు కుంటున్నారు? నన్నెవరు పూజిస్తున్నారు? ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవిని పూజిస్తున్నారు”
మహావిష్ణువు నవ్వాడు. “కథ చెప్పుకునేటప్పుడు నిన్ను తలచుకుంటూ నీ గురించే గదా చెప్పుకుంటారు!” అన్నాడు.
“పోనీలెండి. ప్రఖ్యాతి మీకొస్తే ఏమిటి మీ భార్యనైన నాకొస్తే ఏమిటి? సరే, స్వామీ! ఎలాగూ నన్ను పిలిచారు గనుక, ఒక్క కోరిక కోరతాను.”
సత్యాపతి సందేహంగా చూశాడు.
“మరేం లేదు స్వామీ! నరకాసుర వధ ఆ యుగంలో జరిగినా, జరిగి ఇన్నేళ్లయి, యుగం మారినా ప్రజలు ఇంకా ఆ వేడుకలు, సంబరాలు చేస్తూనే వున్నారట. అవి ఎలా చేస్తున్నారో, ఎలా కృతజ్ఞతలు తెల్పుకుంటున్నారో, ఒక్కసారి భూలోకం వెళ్లి చూడాలని వుంది. దయచేసి తీసుకెళ్లరూ” అని ప్రాధేయపడింది సత్యభామ.
ఆయన చిరునవ్వు నవ్వి “ఇప్పుడు నువ్వు భూలోకం చూడలేవు సత్యా. అప్పుడు మనకి ఒక్కడే నరకాసురుడు. ఇవాళ అక్కడ ఎందరో నరాసురులూ, నరకాసురులూ వున్నారు” అన్నాడు.
“అలాగా! ఐతే తప్పకుండా చూడాలి. ఇవాళే దీపావళి గదా, తీసుకెళ్లండి.”
అలాగే, నీ ఇష్టం అన్నాడు మహావిష్ణువు. మహాలక్ష్మిని కూడా రమ్మన్నాడు. ఆమె రానంది. తాను ఆ ఘోరాలు చూడలేనని, పైగా వైకుంఠం వదిలి రాలేననీ కచ్చితంగా చెప్పేసింది.
“అవున్లే, నువ్వు భూలోకం వస్తే అక్కడ పేరుకుపోయిన పేదరికం సమసి పోదూ!” అన్నాడు వ్యంగ్యంగా కృష్ణుడు, సత్యభామతో బయల్దేరుతూ . గరుత్మంతుడు రివ్వున వచ్చి వాలాడు. ఇద్దరూ గరుడవాహనం మీద భూలోకం చేరుకుని, అదృశ్యంగా పైన విహరించసాగారు.
సత్యభామకి భూలోకం అంతా వింతగా కనిపించసాగింది. వాహనాలు, మహా జనం, పెద్ద పెద్ద భవనాలు, మేడలు చూస్తూ ఆమె విస్తుపోయింది. గరుడ వాహనం ఇంకాస్తా కిందికి దిగడంతో, ఒక విశాలమైన మహాపట్నం మధ్యలో “యుద్ధం” లాంటిది కనిపించింది.
“స్వామీ! అదేమిటి స్వామీ దీపావళి పండగ పూట చక్కగా సంబరం చూడొచ్చుననుకుంటే వాళ్లంతా అలా పోట్లాడుకుంటున్నారేమిటి?” అని అడిగింది. అయోమయంగా సత్యాదేవి.
“ఒకరు దీపావళి పండుగ చేసుకుంటూ మహాలక్ష్మీదేవిని ఊరేగిస్తూ వుంటే, ఇంకో వర్గంవారు అడ్డుపడ్డారు. రెండువర్గాలూ ఘర్షణలోకి దిగి, చావగొట్టు కుంటున్నారు”
“అయ్యయ్యో – మధ్యలో వాళ్లెవరో ఏమిటో పేలుస్తున్నారే”
“వాళ్లని పోలీసులంటారు. రెండు వర్గాలూ అదుపు తప్పిపోవడంతో, వాళ్లు తుపాకులు పెట్టి కాలుస్తున్నారు”
అయ్యయ్యో ఎందరు మనుషులు చచ్చిపోతున్నారో ఎన్ని భవనాలు, వాహనాలూ అవీ ధ్వంసం అయిపోతున్నాయో” అని సత్యభామ బాధ పడింది.
“ఇంకా అటు చూడు” అని కృష్ణుడు, మరికొన్ని పోట్లాటలూ, గృహ దహనాలూ హత్యలూ చూపించాడు.
“స్వామీ! నాకు భయంగా వుంది. ఇన్ని ఘోరాలు, ఇంతటి దారుణం జరుగుతూ వుంటే, దీపావళి వేడుకలు జరక్కపోతే యేం?”
“పండుగలు, వేడుకలూ వస్తే ఒక వర్గం చేసుకోగా ఇంకో వర్గం ఊరుకోదు. ఇవన్నీ పండుగరోజుల్లో మామూలే. ఈ మంటలు దీపావళి కాంతులు కావు. ఆ ఘోష, సంబరం కాదు ఆ వాహనాలు, ఇళ్లు అన్నీ వాళ్లవే. వాళ్ల ప్రభుత్వ ఆస్తుల్ని వాళ్లే ధ్వంసం చేసుకుంటున్నారు”
“ఎంత అన్యాయం! దేవతల్ని మించిన తెలివితేటలు గల మానవులు ఇంత అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నారా ఆశ్చర్యంగా వుంది”
గరుడపక్షి వాళ్లని ఇంకోవేపు తీసుకెళ్లింది.
“స్వామీ – ఇక్కడ వీళ్లంతా ఇన్ని వరసలుగా నించున్నారేమిటి?”
“వాటిని క్యూలంటారు. అక్కడ అలా దారుణం జరిగిపోతూనే వుందా- ఇక్కడ వీళ్లు వినోదం కోసం ఎగబడుతున్నారు. సినిమాలనీ, డాన్సులనీ వుంటాయి. అవి చూడ్డానికని, ఆ టిక్కట్ల కోసం ఇలా క్యూల్లో నించుంటారు. ఆ క్యూ చూశావా అది ఇలాంటిది కాదు. అది పాలకోసం. పాలు కొనుక్కోడానికి, అలా అంతమంది నించుని వున్నారన్నమాట”
“పాలకోసం కూడా రద్దీయా?’
“పాలంటావేమిటి -ఇలా చూడు. ఇంకా పెద్ద క్యూ ఇది. ఇది నీళ్లకోసం. బిందెలు, చెంబులూ, గంగాళాలు పట్టుకుని ఎందరు స్త్రీలు నించున్నారో చూశావా – నీళ్లకోసం! తాగడానికి నీళ్లకోసం”
“నీరుకూడా దొరకదా స్వామి భూలోకంలో? ఇన్ని నదులూ, చెరువులూ, సరస్సులూ వుండగా నీరు దొరక్కపోవడం ఏమిటి?”
“నీరుంది. నదులు పొంగుతూనే వున్నాయి. కానీ అవన్నీ ప్రభుత్వం వారి రాజకీయపు సుడుల్లో చిక్కుకున్నాయి. కావలసిన వాళ్లకి అందవు”
“లేచిన దగ్గర్నుంచి ప్రతిదానికీ ఇలా వరసల్లో జనం నించుంటే, తక్కిన పని పాట్లన్నీ ఎలా చేసుకుంటారు?”
“అసలు ఈ క్యూలు అన్నవి ఇంకా వున్నాయి. ఇంకా ఎన్నో విచిత్రాలు చూపిస్తాను చూడు. ఈ పండగ నాటికి కొన్నిరోజులు ముందుకి వెళదాం. జరిగిన ఘోరాలూ, నేరాలూ చూద్దువుగాని”
దీపావళికి ముందు జరిగిపోయిన కొన్ని ఘట్టాల్ని, దృశ్యాల్నీ చూపించసాగాడు శ్రీకృష్ణుడు.
“ఆ కేకలు, ఆ జనం, ఉరుకులు, పరుగులూ ఏమిటి స్వామీ?”
“ఊరేగింపులు. ఉద్యోగులు జీతాలు చాలవని ఊరేగింపు చేస్తున్నారు. ఆ ఊరేగింపులు చూశావా ఒక దాన్నొకటి కౌరవ పాండవ సైన్యాల్లాగ ఎలా ఎదుర్కొంటున్నాయో!’
“అవును! చూడ్డానికి భయంకరంగా వుంది”
“కొంతమందికి ఉద్యోగాలు ఎక్కువ చేస్తానంది ప్రభుత్వం. మరి కొంతమంది అన్యాయం, అక్రమం అనీ కూడదంటున్నారు. కూడదన్నవాళ్లు, కూడును అన్న వాళ్లూ ఊరేగింపులు చేస్తూ ఒకర్నొకరు చంపుకుంటున్నారు. మధ్యలో ప్రభుత్వపు దేశరక్షకులు కాల్పులు చేస్తున్నారు. దుకాణాలు, వాహనాలు, భవనాలూ ధ్వంసం అయిపోతున్నాయి. అరాచకం చూశావా ఎలా ప్రబలిపోతోందో!”
“చాలా అన్యాయంగా వుందే”
“ఆ ఊరేగింపు, జనం చూశావా దాన్ని సమ్మె అంటారు. చదువుకుంటున్న విద్యార్థుల్లో ఒక విద్యార్థి దొంగతనంగా సమాధానం తెచ్చి రాస్తూ పట్టుబడ్డాడు. అధికారులు అతను పరీక్ష రాయడానికి కుదరదని పొమ్మన్నారు. అలా పొమ్మనడం నేరం అని తక్కిన విద్యార్థులంతా కళాశాలలకీ, పాఠశాలలకీ వెళ్లకుండా, వెళ్లనీయ కుండా సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మె, జీతాలు పెంచమని కార్మికులు చేస్తున్న సమ్మె. ఈ సమ్మె నిజాయితీపరుడైన తమ అధికారిని పదవి నుంచి తీసేయమని సమ్మె. ఇలాంటివే ఇవన్నీ సమ్మెలు. ఇంకా బంద్లనీ, ఘెరావ్ నీ ఏవేవో పేర్లున్నాయి. ఆ గొడవ చూశావా – రాముడి జన్మభూమి అదేననీ కొందరు, అదికాదని మాదని ఇంకొందరూ ఊరేగింపులుగా వెళ్లి అల్లర్లు చేస్తున్నారు. అటు చూడు, సాధువుల సమాజం. వాళ్లకేవో కోర్కెలు. వాళ్లూ ఊరేగింపు చేస్తున్నారు- సాధువులైవుండీ దహనకాండ, హింసాత్మక చర్యలూ చేపట్టారు చూడు…”
“వాతావరణం అంతా భయంకరంగా, అశాంతి అలజడులతో వుంది స్వామీ! ఎక్కడా శాంతి, క్షేమం వున్నట్టులేవే”
“ప్రతి రాష్ట్రంలోనూ గొడవలున్నాయి. హత్యలు, దోపిడీలు, మానభంగాలు, దౌర్జన్యం, దారుణం, దహనకాండ… ఇలా ఎన్నో… చూశావా సత్యా!”
సత్యభామ కళ్లు మూసుకుంది.
“చాలు స్వామి చాలు. దీపావళి వేడుకలు, సంబరాలు, పూజలు చూపించ మంటే, ఇవన్నీ చూపిస్తున్నారు. చాలు! నేనింక చూడలేను. ఈ అక్రమాలు, దౌర్జన్యాలు, రాక్షసత్వం, నరకుడి చేష్టల్ని మించిపోయి వున్నాయి. అవునూ… దుష్ట శిక్షణ చేసి, శిష్ట రక్షణ చెయ్యడానికి, పాపం పెచ్చు పెరిగితే హరించడానికి అవతరిస్తానని చెప్పారే – ఈ అధర్మం చాలదా? మీరు అవతరించి, ఈ అన్యాయాన్ని అంతరింప జేసి, ధర్మాన్ని నెలకొల్పడానికి ఇది తరుణం కాదా? ఇంకా ఆలస్యం చేస్తున్నారేం ప్రభూ?”
శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు.
“సత్యా! ఇది కలియుగం. ఈ యుగంలో నేను అవతరించి చేసేదేం లేదు. పాపం పెరిగిపోతోంది. నీతి, నిజాయితీ మచ్చుకి కూడా లేవు. నేను అవతరించి, ఎవర్ని ఉద్దరించాలి? ఎక్కడైనా సన్మార్గులుంటే, వాళ్ళు అతీతులుగానే వుంటారు. ఇదంతా ఈ మానవులు చేజేతులా చేసుకుంటున్నారు. స్వార్ధం పెరిగిపోవడంతో అర్థం చేసుకోగల శక్తి సన్నగిల్లింది. ధర్మం పూర్తిగా నశించి పోతోంది. ఈ మానవులంతా వాళ్లలో వాళ్లే ఇలా ప్రతిదానికీ పోట్లాడుకుంటూ, అమాయకుల్ని బాధలు పెడుతూ, ఒకర్నొకరు కొట్టుకునీ, తన్నుకునీ, పొడుచుకుని చస్తారు. ధర్మాన్ని నాశనం చేసినవాళ్లే, మంచితనాన్నీ హరింపజేస్తారు. పాపం పండుతోంది. ప్రజానాశనం దానంతటదే జరుగు తుంది. ఇక నేను అవతారం ఎత్తి శిష్ట రక్షణ చెయ్యడానికి శిష్టులు లేరు! దుష్ట శిక్షణ దానికదే జరుగుతుంది. చూశావా దీపావళి”
“అంతా పాపావళి! నేనింక చూడలేను. తిరిగి పోదాం పదండి. మనమైనా ప్రశాంతంగా వుందాం” అంది సత్యభామ విచారవదనంతో. గరుత్మంతుడు రివ్వున ఊర్థ్వలోకాలకు ఎగిరాడు. కృష్ణ సత్యభామలు మళ్లీ భూమివేపు చూడకుండా పైపైకి పారిపోయారు.
భూమ్మీద హాహాకారాలు, దమనకాండ విజృంభిస్తూనే వున్నాయి…








