సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలకు, ప్రత్యేకించి ఆడబిడ్డలకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక, ప్రకృతి, ఆడబిడ్డల ఆరాధనకు బతుకమ్మ పండగ నిలువెత్తు నిదర్శనమని అన్నారు.
ప్రకృతి, పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు మన తెలంగాణ అని చెప్పారు. తీరొక్క పూలతో చేసిన, ఘనమైన బతుకమ్మలతో ఆడ బిడ్డలందరూ ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఈ పూల పండుగ ప్రతి ఇంటా ఆనందాల పూలవాన కురిపించాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, సుఖశాంతులు వెల్లివిరియాలని, తెలంగాణ సంస్కృతి వైభవం తరతరాల పాటు నిలవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ పండుగ ప్రజల సాంస్కృతిక వైభవం, మహిళల ఐక్యతను చాటి చెప్పడంతో పాటు, అనేక సామాజిక అంశాలతో నిండి ఉందన్నారు. రాష్ట్ర మంతా బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం హర్షణీయమని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం అందజేస్తూ ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు.








