కూటమి నేతలతో చంద్రబాబు అత్యవసర భేటీ..!
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం ముగుస్తున్న తరుణంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకవైపు ప్రతిపక్ష వైసీపీ(YSRCP) రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయంటూ గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) కౌంటర్ వ్యూహాలకు పదును పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కావాలనే ఉద్రిక్తతలు సృష్టిస్తోందని మండిపడ్డారు. పొలిటికల్ మైలేజ్ కోసమే నామినేషన్ కేంద్రాల వద్ద గొడవలు రేపుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ఆడుతున్న ఈ పొలిటికల్ డ్రామాలు, కుట్రలపై కూటమి శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వాటిని ప్రజల ముందు సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రక్రియ ఎక్కడా కూడా హింసాత్మకంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాకుండా ప్రభుత్వ మరియు పోలీస్ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండేలా మంత్రులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతిపక్షాలకు ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం ఇవ్వకుండా, చట్టాన్ని అతిక్రమించే వారు ఏ పార్టీ వారైనా సరే కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఈ స్థానిక ఎన్నికలను తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి నేతలు క్షేత్రస్థాయిలో పూర్తి సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రతి సీటులోనూ కూటమి జెండా ఎగిరేలా పక్కా ప్లాన్తో పనిచేయాలని ప్రజాప్రతినిధులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.








