పుంగనూరు మున్సిపల్ ఎన్నికల నుంచి వైసీపీ అవుట్..!
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ ఊహించని సంచలనం నమోదైంది. వైసీపీకి బలమైన కోటగా భావించే పుంగనూరు నియోజకవర్గంలో ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పుంగనూరు(Pungunuru) మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు ఎవరూ పోటీ చేయడం లేదని, ఈ ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ(YSRCP) రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు.
పుంగనూరులో గత రెండు రోజులుగా నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీనిపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పుంగనూరులో అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు తెగబడుతున్నారని ఆరోపించారు. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడమే కాకుండా, వారిని భౌతికంగా నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు.
నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, అధికార పార్టీ శ్రేణులకు వత్తాసు పలుకుతోందని ధ్వజమెత్తారు. “మా అభ్యర్థుల ప్రాణాలకు రక్షణ లేని చోట, అసలు నామినేషన్లే వేయనివ్వని పరిస్థితుల్లో ఎన్నికల్లో పాల్గొనడం అర్థరహితం. అందుకే పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించాం” అని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న యాక్షన్ ప్లాన్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు పలికారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని, మున్సిపల్ ఎన్నికల పేరుతో సామాన్య ప్రజలను, ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్తో తాము గవర్నర్ను, అవసరమైతే దేశ రాష్ట్రపతిని కూడా కలిసి ఇక్కడి అరాచకాలను వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో పుంగనూరు మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు అధికార కూటమికి ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామంతో చిత్తూరు జిల్లా అంతటా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా మారింది.








