జడ్పీ చైర్మన్ పీఠమే లక్ష్యంగా చిన్నశ్రీను పక్కా వ్యూహం..!
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పర్వంలో ఉత్తరాంధ్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన విజయనగరం జిల్లాలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె మజ్జి సిరి సహస్ర తెర్లాం జడ్పీటీసీ(zptc) స్థానానికి కూటమి తరఫున అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో భారీ అనుచరవర్గం నడుమ ఆమె తన నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.
ఇటీవలే వైసీపీని వీడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి(chandrababu naidu) సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన సిరి సహస్ర… క్షేత్రస్థాయిలో కూటమి విజయమే లక్ష్యంగా ప్రచార బరిలోకి దూకడంతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. విజయనగరం మున్సిపల్ మేయర్ స్థానానికి సంబంధించి తొలుత పలు ప్రచారాలు సాగినప్పటికీ, సాంకేతిక కారణాలు, సమీకరణాల నేపథ్యంలో కూటమి అగ్రనాయకత్వం ఆమెను నేరుగా జిల్లా పరిషత్ రేసులోకి దించినట్లు తెలుస్తోంది.
తెర్లాం జడ్పీటీసీ స్థానాన్ని అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకుని, ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన విజయనగరం జడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా చిన్న శ్రీను ఈ పక్కా పొలిటికల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాల్లో పట్టున్న చిన్న శ్రీను… తన గ్రౌండ్ లెవెల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి కుమార్తెను భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
మరోవైపు, ప్రతిపక్ష వైసీపీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన సొంత కుటుంబ సభ్యులను జడ్పీటీసీ బరిలోకి దించడంతో… విజయనగరం జిల్లా పరిషత్ పీఠం కోసం సాగబోయే ఈ పోరు ఇప్పుడు ‘బొత్స ఫ్యామిలీ వర్సెస్ చిన్న శ్రీను’గా మారిపోయింది. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ అండదండలు ఉండటం, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి శ్రేణులు కలిసికట్టుగా పనిచేస్తుండటంతో సిరి సహస్ర గెలుపుపై కూటమి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ పరిషత్ పోరులో విజయం ఎవరిని వరిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.








