ప్రజాభవన్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్
ఎల్‌నినో అంటే ఏదో భూతం కాదు.. కరువు. ప్రపంచంలోని చాలా దేశాలు కరువును ఎదుర్కొన్నాయి. ఎండ వేడి విపరీతంగా పెరుగుతుంది.. నీళ్లు అందుబాటులో ఉండవు. ఎండ వేడి, నీటి కొరత వల్ల విద్యుత్ వినియోగం బాగా పెరుగుతుంది. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్‌ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎస్ఐఆర్ ప్రక్రియను బీజేపీ దురుద్దేశంతో ఉపయోగించుకుంటోంది. ఎస్ఐఆర్ ప్రక్రియపై పేదల పక్షాన రాహుల్ గాంధీ పోరాడుతున్నారు.
నవంబర్ 1న ఢిల్లీలో రాహుల్ గాంధీ భారీ సభ నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి ఈ సభకు 10 వేల నుంచి 15 వేల మంది తరలివెళ్లాలి. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా పేదల హక్కులను కాలరాసి, అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఎన్నికలు కొత్త కాదు.. ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కొత్త కాదు. కొన్ని సందర్భాల్లో ఓడినా, రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ పోటీ చేసి గెలిచింది.
ప్రకృతి వైపరీత్యాలు మూడు రకాలు.. కరువు, వరదలు, భూకంపాలు. వీటిని మనం నివారించలేం. భూకంపం వల్ల అపార నష్టం జరుగుతుంది. కరువు ప్రారంభమైనప్పుడు దాని ప్రభావం అంతగా తెలియదు. కరువుపై ఆరు నెలల నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని, కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని కొందరు మాట్లాడుతున్నారు. రాజకీయ దురుద్దేశంతో కూడిన ప్రకటనలను కొందరు చేస్తున్నారు.
దేశంలోని మహారాష్ట్ర, ఏపీ, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని 100 దేశాలపై ఎల్‌నినో ప్రభావం ఉంది. మామ, అల్లుళ్లు మాత్రమే మేధావులా? బ్రిటన్ లాంటి దేశంలో కూడా ఎల్‌నినో వల్ల కరువును ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మంచినీటిని రేషన్‌లా ఇస్తున్నారు. ప్రతి మనిషి 20 శాతం నీటి వినియోగాన్ని తగ్గించాలనే నిబంధనలు పెట్టారు. అక్టోబర్‌లో మొదలైన కరువు జూలై వరకు ఉంటుంది. ఎండ వేడి పెరుగుతుంది.. నీటి ఆవిరి పెరుగుతుంది.. నీటి సమస్య వస్తుంది. సాగునీటి కంటే తాగునీటికే కష్టాలు వస్తాయి. సమస్య చిన్నగా మొదలై పెద్దదిగా మారుతుంది.
ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలను అప్రమత్తం చేయకుండా, వారిని భాగస్వాములను చేయకుండా ఈ కరువును ఎదుర్కోలేం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సబ్‌కమిటీని ఏర్పాటు చేశాం. తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడానికి రామకృష్ణారావును ఎల్‌నినోపై ప్రత్యేక అధికారిగా నియమించాం. 2019లో కరోనా వచ్చింది. కరోనా గురించి అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు, ఎండ కొడితే, క్రోసిన్ వేసుకుంటే పోతుందని కేసీఆర్ దబాయించి మాట్లాడారు. కరోనాను సీసాలో వేసి బంధిస్తానన్నట్లుగా కేసీఆర్ మాట్లాడారు. లక్షలాది మంది కరోనాతో చనిపోయారు. శ్మశానాల్లో స్థలం లేని పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే ప్రజలు నమ్మారు. బాధ్యత లేకుండా కరోనాపై మాట్లాడటం వల్ల చాలా మంది శ్మశానాలకు వెళ్లారు. కేసీఆర్ మాటలు నమ్మినవాళ్లు ఈ రోజు బతికి ఉన్నారు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్న హరీశ్ రావును నమ్ముకుని పంటలు వేసుకుంటే, మట్టి పోసి అంబలి తాగాల్సి వస్తుంది. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి.. ప్రజల్లో అవగాహన కల్పించాలి. కోట్లాది మంది వలస కార్మికులు కరోనా సమయంలో సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఉపాధి హామీ పథకం ఆ నాడు ఆకలి తీర్చింది.
మతం పేరుతో విడగొట్టి అధికారంలోకి రావాలని మోదీ అంటున్నారు.. మానవత్వాన్ని కూడగట్టి అధికారంలోకి రావాలని మనం అంటున్నాం. కరోనా సమయంలో మోదీ ఏం చెప్పినా చేశాం. ప్రకృతి సృష్టించిన విపత్కర పరిస్థితి ఎల్‌నినో. వానాకాలంలో ఎలాంటి సమస్య లేదు. కానీ మూడు నెలల తర్వాత సమస్యలు మొదలయ్యాయి. వానాకాలం పంటల నుంచి బయటపడ్డాం. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ సీజన్లో 13 వేల మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం కాలేదు. ఈ సీజన్లో 20 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ప్రతి ఏడాది ఆరున్నర శాతం విద్యుత్ వినియోగం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈసారి ఊహించకుండా 20 శాతం వరకు విద్యుత్ వినియోగం పెరిగింది.
అధికారులు 24 గంటలు కష్టపడి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో భట్టి విక్రమార్కను, అధికారులను అభినందిస్తున్నాను. 20 వేల మెగావాట్ల విద్యుత్‌ను భట్టి విక్రమార్క, విద్యుత్ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. వానాకాలం పంటలను ఏదో రకంగా రక్షిస్తాం.. కొనుగోలు చేస్తాం. ఏడు రకాల సన్న వడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని గత సీజన్లో చెప్పాం. సన్న వడ్లను ఏడు రకాలకే పరిమితం చేయడం బోనస్ ఎగ్గొట్టడానికేనని హరీశ్ రావు ఆరోపించారు. మార్కెట్లో రూ.3,400 నుంచి రూ.4,000 వరకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు అడ్వాన్స్‌లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ప్రజలు నమ్మి ఏడు రకాల సన్న వడ్లు పండించినందుకు అత్యధిక ధర వచ్చింది. కేటీఆర్, హరీశ్ రావు బద్నాం చేశారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చుని ప్రణాళికలు వేస్తే, కేటీఆర్, హరీశ్ రావు అమలు చేస్తున్నారు. మనిషి పెరిగితే ఆలోచన పెరుగుతుందని అనుకోవడం అవగాహనారాహిత్యమే. తాటి చెట్టులా పెరిగినా ఆలోచన పెరగని వాడే హరీశ్ రావు. వడ్ల ధరలు పెరిగితే ఆటోమేటిక్‌గా బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఈ విషయం హరీశ్ రావుకు తెలియదా? కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 30 లక్షల పంప్సెట్లలో 15 లక్షలు ఎండిపోయాయి. వచ్చే సీజన్లో చుక్క నీరు కూడా దొరకదు. ప్రాజెక్టుల్లో 20 శాతం నీటి నిల్వలు కూడా లేవు. 200 టీఎంసీల నీళ్లు కూడా లేవు.. డెడ్ స్టోరేజీకి చేరాయి. తాగునీటికి తప్ప సాగుకు ఏ మాత్రం అవకాశం లేదు. ఈ విషయాన్ని దాచిపెడితే క్యాన్సర్‌లా మారుతుంది. 8 నుంచి 10 నెలల పాటు ఈ కరువును ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వం నిజాలను ప్రజలకు వెల్లడించకపోతే అన్ని రకాలుగా దెబ్బతింటాం. వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం జరగదు.. ఆరుతడి పంటలు, కూరగాయల సాగు మాత్రమే చేయాలి. రైతు వేదికల్లో రైతులకు అవగాహన కల్పించాలి. నోరులేని మూగజీవాలకు పశుగ్రాసం అత్యంత కీలకం. గ్రామాల్లో పశువుల కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి, పశుగ్రాసం, తాగునీరు అందించాలి. ఉపాధి హామీ పథకంలో ఈ కార్యక్రమాలు చేపట్టాలి.








