మళ్లీ ‘దేశ్ కీ నేత’గా కేసీఆర్?
కేసీఆర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలంగాణ ఉద్యమ సారథిగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాష్ట్రం సాధించిన తర్వాత దాదాపు పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారాయన. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఉన్నా కూడా అసెంబ్లీకి హాజరు కావట్లేదు. అడపాదపడా పార్టీ సమావేశాల్లో పాల్గొనడం తప్పితే రోజువారీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే ఆయన మళ్లీ యాక్టివ్ కావాలని, కేసీఆర్ రంగంలోకి దిగితే పరిస్థితి మరోలా ఉంటుందని బీఆర్ఎస్ కేడర్ మొత్తం భావిస్తోంది. ఎంతోమంది ఈ విషయాన్ని పలుమార్లు కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఆయన మాత్రం ఇంకా రోడ్డెక్కలేదు. ఫాంహౌస్ కే పరిమితమయ్యారు. ఎవరైనా నేతలు కలవాలనుకుంటే అక్కడికే వెళ్లి కలుస్తున్నారు. పార్టీ రివ్యూలను కూడా ఆయన అక్కడి నుంచి నిర్వహిస్తున్నారు.
అయితే ఇవాళ కేటీఆర్ చేసిన కామెంట్, కేసీఆర్ యాక్టివేట్ కావడంపై మళ్లీ ఊహాగానాలకు దారితీస్తోంది. త్వరలోనే కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కాబోతున్నారని.. అది కూడా తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా.. దేశంలోనే కీలక పాత్ర పోషించే రోజులు రాబోతున్నాయని ఆయన అన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలన్నీ యాక్టివ్ అవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో కేసీఆర్ మళ్లీ దేశస్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు మళ్లీ జోరందుకున్నాయి.
ఇవి కూడా చదవండి
గతంలో రెండో దఫా అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, జాతీయస్థాయిలో పార్టీని విస్తరించాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మార్చారు. పలు రాష్ట్రాల్లో పర్యటనలు కూడా చేశారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక తదితర రాష్ట్రాల్లో పార్టీ కార్యవర్గాలను కూడా నియమించారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో.. ఆయన పూర్తిగా డీలా పడ్డారు.
ఇప్పుడు కేటీఆర్ మాటలను బట్టి చూస్తే కేసీఆర్ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. అయితే గతంలో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే కేసీఆర్ సత్తా చాటలేకపోయారు. అలాంటిది ఇప్పుడు ఎంతమేర సత్తా చాటతారనేదానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. నిజంగానే కేసీఆర్ జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించేందుకు తెరవెనుక ఏవైనా వ్యూహాలు రచిస్తున్నారా.. లేకుంటే కేడర్ లో జోష్ నింపేందుకు కేటీఆర్ ఈ మాట అన్నారా.. అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.!








