కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు!
వచ్చే ఏడాది ఆరంభంలోనే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలకు సంబంధించిన ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. ఎలాగైనా ఈ రెండు ఎన్నికల్లో గెలిచి, తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలనుకుంటోంది. అయితే కాంగ్రెస్ ఏకపక్ష వైఖరికి నిరసనగా వామపక్షాలతో పాటు మిత్రపక్షమైన తెలంగాణ జనసమితి సొంతంగా అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ, బుజ్జగింపులు మొదలుపెట్టింది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. ఈ సమయంలో జరిగే ఎలాంటి ఎన్నికలైనా ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగానే చూడాల్సి ఉంటుంది. అందుకే వీటిని అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా 2028 ఎన్నికలకు గేట్ వే రెడీ చేసుకోవాలనుకుంటోంది. అందులో భాగంగానే అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థులను ఖరారు చేసేసింది. ఈ ఎన్నికలకు 77 మంది పరిశీలకులను నియమించి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది.
ఇంతవరకూ బాగానే ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సీపీఐ, తెలంగాణ జన సమితి మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలను సంప్రదించకుండానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంపై ఆ పార్టీలు అసంతృప్తితో ఉన్నాయి. అందుకే ఖమ్మం- వరంగల్- నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ఉమ్మడిగా అభ్యర్థిని దించాలనే ఆలోచనకు వచ్చాయి. ఈ ఉమ్మడి జిల్లాల్లో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ. కోదండరాం నేతృత్వంలోని టీజేఎస్ పార్టీకి విద్యావంతుల నుంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. వీళ్లిద్దరికి సీపీఎం కూడా మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది.
ఒకవేళ సీపీఎం, సీపీఐ, టీజేఎస్ ఉమ్మడిగా అభ్యర్థిని బరిలోకి దించితే కచ్చితంగా అది కాంగ్రెస్ ఓటుబ్యాంకుపై ప్రభావం చూపిస్తుంది. ఓ వైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ ఈ ఎన్నికల్లో గట్టిగా ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును వామపక్షాలు చీల్చితే మొదటికే మోసం రావచ్చు. పైగా ఈ జిల్లాల్లో వామపక్షాలకు గట్టి పట్టుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా మేల్కొంది.
వామపక్షాల వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ వెంటనే ఆ పార్టీలతో చర్చలకు సిద్ధమైంది. సీపీఐ, సీపీఎంలతో పాటు టీజేఎస్ పార్టీలతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, మల్లు రవి తదితరులు చర్చలు జరిపాలని నిర్ణయించారు. ఎలాగైనా వామపక్షాలను దారికి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి, వీళ్లకు బాధ్యత అప్పగించినట్లు సమాచారం. మరి వామపక్షాలు, టీజీఎస్.. కాంగ్రెస్ బుజ్జగింపులకు తలొగ్గుతాయా.. లేదా .. అనేది త్వరలోనే తేలనుంది.








