Ramachandar Rao: రామచంద్ర రావు వైపే బీజేపీ మొగ్గు!?
తెలంగాణలో త్వరలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికలకోసం ఓటర్ల నమోదు ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీలూ దృష్టిపెట్టాయి. అయితే మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావును బరిలోకి దించాలని ఆ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది. త్వరలోనే ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.
ఏ ఎన్నికల్లోనైనా గెలుపే లక్ష్యంగా పనిచేసే బీజేపీ ఈ నియోజకవర్గంలోనూ అదే ఫార్ములాను అమలు చేస్తోంది. పార్టీ కేంద్ర నాయకత్వం పలు సర్వే నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రామచందర్ రావు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. పట్టభద్రులు, నిరుద్యోగులు, మేధావి వర్గాల్లో ఆయనకు ఉన్న పరిచయాలు, పార్టీలో ఆయన అనుభవం తమకు కలిసి వస్తాయని బీజేపీ నమ్ముతోంది. అయితే, పార్టీ కార్యకలాపాలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలతో బిజీగా ఉన్న రామచందర్ రావు మొదట్లో పోటీ పట్ల అంత ఆసక్తి చూపలేదని సమాచారం. అయినప్పటికీ, పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడానికి, విజయ అవకాశాలను మెరుగుపరచడానికి బలమైన నాయకుడిని బరిలో నిలపాలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.
గతంలో కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్- మెదక్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గాల ఎన్నికల్లో సాధించిన విజయాలతో బీజేపీ శ్రేణుల్లో జోరు పెరిగింది. 2028 అసెంబ్లీ ఎన్నికల వరకూ ఈ ఊపును ఇలాగే కొనసాగించాలని పార్టీ భావిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పట్టభద్రులు, లాయర్లు, వివిధ రంగాల నిపుణుల మద్దతును కూడగట్టుకోవడం ద్వారా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది.
మరోవైపు.. నల్గొండ- వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలోనూ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో నాలుగో స్థానానికి పరిమితమైన చోట, ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని చూస్తోంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ తన పరిధిని విస్తరించుకోవడానికి చేస్తున్న తీవ్ర ప్రయత్నానికి నిదర్శనం.
మొత్తంగా చూస్తే.. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను కేవలం శాసనమండలి స్థానాల భర్తీగా కాకుండా, రాష్ట్రంలో తమ రాజకీయ ప్రభావాన్ని బేరీజు వేసే వేదికగా బీజేపీ మలుచుకుంటోంది. రామచందర్ రావు లాంటి సీనియర్ నేతను రంగంలోకి దించడం ద్వారా అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలని కమలదళం వ్యూహరచన చేస్తోంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది వేచి చూడాలి.








