ఇన్వెస్టర్లు లేక బిజినెస్ అమ్మేసుకొని.. అమెరికాకి స్టార్టప్ ఓనర్
భారత్ లో వున్న జ్ఞాన సంపదకు, అవకాశాలకు ఎలాంటి కొదవా లేదు. ఇక్కడ పేరు ప్రతిష్ఠలు సంపాదించి, లేదా ఎక్కడైనా ఇబ్బందులు పడ్డ తర్వాత, విదేశాలకు వెళ్లి కూడా తమ ప్రతిభను ప్రదర్శించాలని కోరుకున్న వారు పుష్కలం. వారికేమీ కొదవా లేదు. ఇప్పుడు ఇలాంటి ఉదాహరణే ఒకటి జరిగింది.
24 ఏళ్ల అనఘా రాజేష్ ది. భారతదేశంలోనే పుట్టి, ఇక్కడే చదువుకొని, ఇక్కడే ఒక అద్భుతమైన టెక్నాలజీని నిర్మించిన యువతి ఇప్పుడు తన స్టార్టప్‌ను శాన్ఫ్రాన్సిస్కోకు తరలించారు. ఇది కేవలం ఆమె వెళ్లడమే కాదు, భారత్‌లోని డీప్‌టెక్ ప్రతిభ విదేశాలకు ఎలా వెళ్తుందో చూపించే పరిస్థితులకు అద్దం పడుతోంది. అనఘా రాజేష్ బిట్స్ పిలానీ (గోవా) గ్రాడ్యుయేట్. 2024లో ఆమె బెంగళూరులో బయోకంప్యూట్ అనే స్టార్టప్‌ను స్థాపించారు. ఆమె లక్ష్యం చిన్నది కాదు. ప్రపంచంలోని భారీ డేటాను సాధారణ హార్డ్ డిస్క్‌లు, టేపుల బదులుగా మానవ శరీరంలోని డీఎన్ఏలో నిల్వ చేయడం. అవును దీనికి సంబంధించి ఆమె ఇప్పటికే విస్తృత ప్రయోగాలతో సంచలనం సృష్టించింది.
నిజానికి సాధారణ కంప్యూటర్లలో డేటాను హార్డ్ డిస్కులు, మెమోరీ చిప్, క్లౌడ్ డేటా సెంటర్లలో భద్ర పరుస్తుంటాం. కానీ అనఘా రాజేష్ మాత్రం 2024 లో బెంగళూరులో స్థాపించిన బయో కంప్యూటర్ సంస్థ డీఎన్ఏ సాయంతో డేటాను స్టోర్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. కేవలం గ్రాము డీఎన్ఏలో దాదాపు 2 లక్షల జీబీ డేటాను భద్రపరచవచ్చు. ప్రపంచంలో భారీ డేటా సెంటర్లను కూడా చిన్న అణువు పరిమాణంలో కుదించవచ్చు.ఇక్కడ మరో విశేషం ఏంటంటే, సాధారణ హార్డ్ డిస్కుల్లో డేటా కొన్నేళ్లలో పాడైపోవచ్చు.. అదే ఈ డీఎన్ఏలో డేటా వేల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. బెంగళూరులో ల్యాబ్ పెట్టి, రెండేళ్లలోనే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నుంచి ఎండ్ టు ఎండ్ ప్రోటోటైప్ వరకు తీసుకొచ్చింది బయోకంప్యూట్ సంస్థ.
ఇంత వరకూ చాలా అద్భుతంగానే నడిచింది. కానీ.. భారత దేశంలోని కొందరు పెట్టుబడిదారులు వేగంగా, అతి తొందరగా లాభాలు ఆశించడంతో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఆమె కంపెనీకి ఆశించినంత పెట్టుబడులు రాలేదని తెలుస్తోంది. దీంతో అనఘా రాజేష్ బెంగళూరులోని తన ల్యాబ్ అమ్మేసి, అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లిపోయారు.
నిజానికి అనఘా రాజేష్ రూపొందించిన డీఎన్ఏ డేటా స్టోరేజీ టెక్నాలజీ భవిష్యత్తులో భారీ డేటాను సురక్షితంగా దాచుకునేట్లు వుంది. ఇదే కోణంలో ఆమె భారతీయ ఇన్వెస్టర్లను కూడా సంప్రదించినా… ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. నూతన ఆవిష్కరణల పట్ల రిస్క్ తీసుకునే సాహసం చేయక.. ఇన్వెస్టర్లు ప్రాజెక్టుకు ఫండింగ్ నిరాకరించారు.
అమెరికాలో మాత్రం అనఘా రాజేష్ ప్రతిభను ఇన్వెస్టర్లు ఠక్కుమని గుర్తించినట్లు తెలుస్తోంది. పెట్టుబడులు అందించేందుకు క్యూ కట్టినట్లు సమాచారం. ‘‘ఇండియా గ్లోబల్ సూపర్ పవర్ కావాలని అనుకుంటోంది. కానీ దేశాన్ని నిర్మించాలనుకునే ప్రతిభావంతులను మాత్రం విలువైన వ్యక్తులుగా గుర్తించడంలో విఫలమవుతున్నారు’’ అంటూ అనఘా రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు.








