ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా కీరన్ పొలార్డ్..!
ఐపీఎల్ (IPL) 2027 సీజన్‌కు ముందు ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీ ఒక కీలక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటివరకు ముంబై జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించిన వెస్టిండీస్ మాజీ దిగ్గజ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ను ముంబై ఇండియన్స్ తమ నూతన హెడ్ కోచ్‌గా నియమించింది. ఈ నెల ప్రారంభంలో హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని పొలార్డ్‌తో భర్తీ చేస్తూ శనివారం మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
ముంబై ఇండియన్స్ విజయాల్లో కీరన్ పొలార్డ్ పాత్ర మరువలేనిది. 2010 ఐపీఎల్ వేలంలో ముంబై జట్టులోకి అడుగుపెట్టిన పొలార్డ్, నవంబర్ 2022లో ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించే వరకు ఆ జట్టులోనే కొనసాగారు. ప్లేయర్‌గా ముంబై ఇండియన్స్ సాధించిన 5 ఐపీఎల్ టైటిళ్ల (2013, 2015, 2017, 2019, 2020) విజయాల్లో ఆయన కీలక భాగస్వామిగా నిలిచారు. రిటైర్మెంట్ అనంతరం 2023 సీజన్ నుండి అదే జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి, ఇప్పుడు ఏకంగా ప్రధాన కోచ్‌గా పదోన్నతి పొందారు.
దీంతో ముంబై ఇండియన్స్ ఫ్యామిలీతో ఆయనకున్న 16 ఏళ్ల అనుబంధంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఎంపిక కావడంపై పొలార్డ్ సంతోషం వ్యక్తం చేస్తూ.. “ముంబై ఇండియన్స్ వంటి గొప్ప జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నా జీవితంలో, నా కెరీర్లో ముంబై జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ బ్లూ అండ్ గోల్డ్ జెర్సీకి ప్రాతినిధ్యం వహించడంలో ఎంత బాధ్యత ఉంటుందో నాకు తెలుసు. నాపై నమ్మకం ఉంచిన నీతా అంబానీ, ఆకాష్ అంబానీ సహా ఎమ్ఐ కుటుంబానికి కృతజ్ఞతలు. ఆటగాళ్లతో కలిసి పనిచేసి జట్టు వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాను” అని అన్నారు.








