Ministers: 2028 ఎన్నికలకోసం పక్క చూపులు చూస్తున్న మంత్రులు!
తెలంగాణ కాంగ్రెస్ లో అప్పుడే 2028 అసెంబ్లీ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ముఖ్యంగా పలువురు మంత్రులు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. కొందరు మంత్రులు తమ సొంత నియోజకవర్గాలను కాదని, ఇతర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇది కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నియోజకవర్గాల పునర్విభజన, రిజర్వేషన్ల మార్పులపై వస్తున్న ఊహాగానాలే ఈ ముందస్తు వ్యూహాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ తదితర ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు నియోజకవర్గాలవారీగా రహస్య సర్వేలు చేయించుకుంటున్నట్టు సమాచారం. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో మారుతున్న రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకోవడంతో పాటు, భవిష్యత్తులో రిజర్వేషన్లు మారితే పోటీ చేయడానికి అనుకూలమైన ప్రత్యామ్నాయ స్థానాలను గుర్తించే పనిలో ఈ సర్వేలు ఉన్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఇప్పటికే సర్వే సంస్థల ద్వారా క్షేత్రస్థాయి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా వైరా నియోజకవర్గంపై కన్నేసిన ఒక కీలక మంత్రి, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ స్థానిక నాయకులతో మమేకమవుతున్నారు. మరో మంత్రి కొత్తగూడెం నియోజకవర్గంపై దృష్టి పెట్టడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శిబిరాల్లో కలవరం రేపుతోంది. ఈ పరిణామాలు అధికార కూటమిలోని మిత్రపక్షమైన సీపీఐ శ్రేణుల్లోనూ ఆందోళనకు దారితీశాయి.
ఇవి కూడా చదవండి
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ మంత్రి తన సొంత నియోజకవర్గంపై పట్టుసడలకుండానే, ముందు జాగ్రత్తగా జిల్లావ్యాప్తంగా ఒక సర్వేను చేయించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే రాజకీయ సవాళ్లను ముందే అంచనా వేయడంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ మంత్రులు, కీలక నాయకులు ప్రత్యామ్నాయ నియోజకవర్గాలపై కన్నేయడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గాల సరిహద్దులు మారుతాయనే అంచనాలతో కొందరు నేతలు ఇప్పటి నుంచే తమ అనుచరుల ద్వారా గ్రౌండ్ రియాలిటీపై ఆరా తీస్తున్నారు.
కేవలం అసెంబ్లీ స్థానాల మార్పు కోసమే కాకుండా, కొందరు మంత్రులు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కేంద్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని మరింత పెంచుకోవాలని ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే మంత్రులు ఈ విధంగా ప్రత్యామ్నాయ స్థానాల కోసం సర్వేలు నిర్వహించడం, రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. సొంత నియోజకవర్గాలపై నమ్మకం సడలిపోతోందా? లేక రాబోయే కాలంలో పార్టీలో లేదా ప్రభుత్వంలో జరగబోయే సమీకరణాల మార్పులను వారు ముందే పసిగట్టారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ, 2028 ఎన్నికల సమరం కాంగ్రెస్ పార్టీలో ముందే మొదలైంది. అధికార పీఠాన్ని కాపాడుకోవడానికి నాయకులు వేస్తున్న ఈ ముందస్తు అడుగులు రాబోయే రోజుల్లో పెను మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది.








