Yadadri Power Plant: యాదాద్రి పవర్ ప్లాంట్ గొడవేంటి?
తెలంగాణ రాజకీయాల్లో విద్యుత్ రంగం మరోసారి కేంద్ర బిందువుగా మారింది. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్‌ను అడ్డుపెట్టుకొని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హయాంలో విద్యుత్ శాఖలో భారీ అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వ విప్ వేముల వీరేశం చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి, భారీగా అవకతవకలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కమిషన్ల కక్కుర్తిపడి ప్రాజెక్ట్ వ్యయాన్ని భారీగా పెంచేశారని, ప్రజా ధనాన్ని వృథా చేశారని మండిపడుతున్నారు. ప్రతిమా గ్రూప్‌నకు కట్టబెట్టిన విదేశీ బొగ్గు దిగుమతి ఒప్పందాల వల్ల రాబోయే 50 ఏళ్లలో సుమారు లక్ష కోట్ల రూపాయల మేర ప్రజాధనానికి గండి పడే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్ లభిస్తున్నప్పటికీ, ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా ఖరీదైన విద్యుత్‌ను కొనుగోలు చేసి రాష్ట్రంపై ఆర్ధిక భారం మోపారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి
2015లో యాదాద్రి పవర్ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగింది. అయితే ప్లాంట్ పనులు నత్తనడకన సాగడానికి, పర్యావరణ అనుమతుల జాప్యానికి గత బీఆర్ఎస్ పాలకుల వైఫల్యమే కారణమని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టారు. నల్గొండ జిల్లాకు జగదీష్ రెడ్డి ఏ ఒక్క అభివృద్ధి ప్రాజెక్టును తీసుకురాలేదని, ఆయన కేవలం రాజకీయ లబ్ధికోసమే పాకులాడారని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని, విద్యుత్ రంగానికి జరిగిన నష్టాన్ని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రభుత్వం గాడిలో పెడుతోందని వారు స్పష్టం చేశారు.
మొత్తంగా యాదాద్రి పవర్ ప్లాంట్ అంశం ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. గత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేపడుతోంది. దీంతో రాబోయే రోజుల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పోరు మరింత ముదిరే అవకాశం ఉంది.








