స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోట కూటమి విజయం సాధించాలి : చంద్రబాబు
కూటమి పార్టీల మధ్య మిత్రధర్మం విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu) స్పష్టం చేశారు.టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. స్థానిక ఎన్నికలు, కూటమితో సమన్వయంపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా కూటమి జెండా ఎగరాల్సిందేనని చెప్పారు. గొడ్డలి పార్టీ అధినేత తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడంతో పాటు కుటుంబ బంధాలనూ పట్టించుకోరని ధ్వజమెత్తారు.
2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకెళ్తున్నామని, ఆ ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. చెప్పాం- చేస్తున్నాం ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చి అరాచకాలకు పాల్పడిన వైసీపీ (YSRCP)కి 2024లో ప్రజలు 11 సీట్టే ఇచ్చి తిరుగుబాటు చేశారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దఎత్తున సంక్షేమ, అభివృద్ధి (Development) కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేశామన్నారు.
ఇవి కూడా చదవండి
రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి, ప్రతి వర్గానికి ప్రయోజనం చేకూర్చేలా రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఈ విషయాలను ప్రజలకు వివరించాలని అన్నారు. కూటమి పార్టీల కార్యకర్తలు మిత్ర ధర్మాన్ని పాటిస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలని, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఓటరూ పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేసేలా చూడాలని, 2024 ఎన్నికల కంటే ప్రతి బూత్లోనూ అధిక ఓట్లు సాధించాలని సూచించారు.








