వాళ్ళు గడ్డి తిన్నారని మీరు తింటారా..?: షర్మిల సంచలన కామెంట్స్..!
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసి ఏకగ్రీవాల జోరు సాగుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సరికొత్త ప్రకంపనలు సృష్టించింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila) విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో కూటమి ప్రభుత్వంపై అత్యంత ఘాటుగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నవి ప్రజా ఆమోదంతో కూడిన ఏకగ్రీవాలు కావని, అధికార మదంతో కూటమి పార్టీలు చేసిన బలాత్కారాలని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవి కూటమి అరాచకానికి, భయోత్పాతానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ‘కూటమి కమిషన్’గా మార్చేశారని, పోలీసు వ్యవస్థను తమ బానిసలుగా వాడుకుంటున్నారని షర్మిల ఆరోపించారు. “కళ్ళముందే నామినేషన్ పత్రాలు చించివేస్తూ, ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రక్తపాతంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదే. ఎన్నికల వ్యవస్థను అవహేళన చేసి, ప్రజల హక్కులను అపహాస్యం చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలు, 639 వార్డులు, 4 జెడ్పీటీసీలు, 32 ఎంపీటీసీ స్థానాల్లో జరిగినవన్నీ బలవంతపు ఏకగ్రీవాలేనని ఆమె లెక్కలతో సహా ఎండగట్టారు.
ఇవి కూడా చదవండి
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనను గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై షర్మిల సంచలన విమర్శలు గుప్పించారు. “ఆనాడు వైసీపీ అరాచకాలు చేసిందని విమర్శించిన మీరు.. నేడు అదే బాటలో ఎందుకు పయనిస్తున్నారు..? వాళ్ళు గడ్డి తిన్నారని, ఈరోజు మీరు కూడా అదే తింటారా..? అసలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదా..? ఉంటే ఈ బలవంతపు ఏకగ్రీవాల పేరుతో ఎందుకీ విచక్షణా రాహిత్యం..?” అంటూ పదునైన ప్రశ్నలు సంధించారు. కూటమి కైవసం చేసుకుంటున్న ఈ స్థానాలు ప్రభంజనం కాదని, ఇది వారి రాజకీయ నిస్తేజానికి నిదర్శనమని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్ షర్మిల గట్టి డిమాండ్ వినిపించారు. ఈ బలవంతపు ఏకగ్రీవాలన్నింటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రకటించిన ఫలితాలను నిలిపివేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూటమికి తొత్తుగా మారకుండా, ప్రజా హక్కులను కాపాడేలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు. స్థానిక పోరులో షర్మిల చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.








