అమెరికా మధ్యంతర ఎన్నికలు: ముందస్తు ఓటింగ్ లెక్కలు ఏం చెబుతున్నాయి?
అమెరికాలో ఎన్నికలు జరగడానికి ఇంకా రెండు వారాల సమయం కూడా లేదు. కానీ అసలు రాజకీయ పోరు మాత్రం పోలింగ్ రోజుకు ముందే మొదలైపోయింది. లక్షలాది మంది ఓటర్లు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ ఓట్ల లెక్కలు బయటకు వస్తుండటంతో అమెరికా రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీకి ఈ గణాంకాలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? ప్రజలు నిజంగా అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్నారా? లేక ముందస్తు ఓటింగ్ లెక్కలు చూస్తే కనిపించేది ఒకటైతే, ఎన్నికల రోజు జరిగేది మరొకటా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు అమెరికా రాజకీయాలకే కాదు.. ప్రపంచ దేశాలతో ఆ దేశ సంబంధాల భవిష్యత్తుకు కూడా కీలకం కావచ్చు.
2.1 కోట్ల ఓట్లు.. ఏం సూచిస్తున్నాయి?
ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన ఎలక్షన్ ల్యాబ్ గణాంకాల ప్రకారం, అక్టోబర్ 23, 2026 నాటికి దాదాపు 2.1 కోట్ల మంది అమెరికన్లు ముందస్తుగా ఓటు వేశారు. అయితే ఈసారి ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఓట్ల సంఖ్య మాత్రమే కాదు. పోటీ తీవ్రంగా ఉన్న కొన్ని కీలక రాష్ట్రాల్లోనూ ముందస్తు ఓటింగ్ గణనీయంగా నమోదవుతోంది.
టెక్సాస్‌లో 28 లక్షలకు పైగా, ఫ్లోరిడాలో దాదాపు 22 లక్షలు, జార్జియాలో సుమారు 15 లక్షలు, నార్త్ కరోలినాలో 12 లక్షలకు పైగా ముందస్తు ఓట్లు నమోదయ్యాయి. మిషిగన్, ఒహియో రాష్ట్రాల్లోనూ ఈ సంఖ్య 9 లక్షలు దాటింది.
ఇవి కూడా చదవండి
ఈ రాష్ట్రాల్లో ఓటర్ల స్పందన ఎందుకు ముఖ్యమంటే.. అమెరికా రాజకీయాల్లో కొన్ని స్థానాల ఫలితాలే కాంగ్రెస్‌లో ఏ పార్టీకి ఆధిపత్యం లభిస్తుందో నిర్ణయించగలవు. అయితే ముందస్తు ఓటింగ్ పెరిగిందంటే మొత్తం పోలింగ్ శాతం కూడా పెరిగినట్లేనని భావించలేం. అలాగే ఎక్కువ ఓట్లు నమోదైనంత మాత్రాన ఏ పార్టీ గెలుస్తుందో కూడా చెప్పలేం.
డెమోక్రాట్లు 45 శాతం.. రిపబ్లికన్లు 30 శాతం!
ముందస్తు ఓటింగ్‌కు సంబంధించిన పార్టీ నమోదు గణాంకాలు ఇప్పుడు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. నమోదైన ముందస్తు ఓట్లలో డెమోక్రాట్లుగా గుర్తింపు ఉన్న ఓటర్లు 45 శాతంగా ఉండగా, రిపబ్లికన్లుగా నమోదైనవారు 30 శాతంగా ఉన్నారు.
నార్త్ కరోలినా, కాన్సాస్, ఐయోవా వంటి సాధారణంగా రిపబ్లికన్లకు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లోనూ ఈ అంతరం కనిపిస్తోంది. దీంతో ఈసారి ఓటర్ల స్పందనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే రిపబ్లికన్ ఓటర్లలో కొంతమంది ముందస్తు ఓటింగ్‌కు దూరంగా ఉండి, ఎన్నికల రోజునే ఓటు వేయడానికి ఇష్టపడతారు. అందుకే ప్రస్తుతం కనిపిస్తున్న అంతరం చివరి వరకు కొనసాగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ట్రంప్‌పై అసంతృప్తి ఓట్లలో కనిపిస్తోందా?
ఈ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కావు. అమెరికాలో జీవన వ్యయం పెరగడం, ఆర్థిక వ్యవస్థపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, ఇంధన ధరలు, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం, ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న దిగుమతి సుంకాలు కూడా చర్చనీయాంశాలుగా మారాయి.
ఈ అంశాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి రిపబ్లికన్లకు ఇబ్బందులు సృష్టించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతంలో ట్రంప్‌కు బలమైన మద్దతు లభించిన కొన్ని ప్రాంతాల్లోనూ ఈసారి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
మరోవైపు, డెమోక్రాట్లు జీవన వ్యయం, ఆర్థిక ఒత్తిళ్ల వంటి అంశాలను తమ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. గతంలో గెలవడం కష్టంగా ఉన్న కొన్ని స్థానాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
అయితే ముందస్తు ఓటింగ్ గణాంకాల ఆధారంగా ఓటర్లు ఏ అంశానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో ఖచ్చితంగా నిర్ధారించలేం. దానికి ఓటర్ల సర్వేలు, ఎన్నికల అనంతర విశ్లేషణలు కూడా అవసరం.
మెయిల్-ఇన్ ఓటింగ్‌పై ట్రంప్ వ్యతిరేకత.. అయినా తగ్గని ఆదరణ
అమెరికా ఎన్నికల్లో మరో కీలక అంశం మెయిల్-ఇన్ ఓటింగ్. పోలింగ్ కేంద్రాలకు నేరుగా వెళ్లకుండా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే ఈ విధానంపై ట్రంప్ గతంలో పలుమార్లు విమర్శలు చేశారు. ఆయన ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని పరిమితం చేసే ప్రయత్నాలు చేసింది.
ఎన్బీసీ న్యూస్ పేర్కొన్న టార్గెట్స్మార్ట్ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 5.7 కోట్లకు పైగా మెయిల్-ఇన్ బ్యాలెట్లు కోరబడ్డాయి లేదా పంపిణీ చేయబడ్డాయి. 2022 మధ్యంతర ఎన్నికల సమయంలో కోరిన 5.2 కోట్ల బ్యాలెట్ల కంటే ఇది ఎక్కువ. ఫ్లోరిడా విశ్వవిద్యాలయ ఎలక్షన్ ల్యాబ్ ప్రకారం, మెయిల్-ఇన్ బ్యాలెట్ల అభ్యర్థనల సంఖ్య దాదాపు ఆరు కోట్లకు చేరింది.
మెయిల్-ఇన్ ఓటింగ్‌ను పరిమితం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును అమెరికా సుప్రీంకోర్టు సెప్టెంబర్‌లో కొట్టివేసింది. అయినప్పటికీ, ఓటర్లు ఈ విధానాన్ని వినియోగించుకోవడం కొనసాగిస్తున్నారు.
అయితే మెయిల్-ఇన్ ఓటింగ్‌ను ఎక్కువగా వినియోగించుకోవడం ఒక్క పార్టీ విజయానికి సంకేతం కాదు. ఏ పార్టీ ఓటర్లు ఎంతమంది బ్యాలెట్లు తిరిగి పంపించారు, ఎన్నికల రోజున ఎంతమంది నేరుగా ఓటు వేశారు, చివరికి ఎన్ని ఓట్లు లెక్కింపులోకి వచ్చాయి వంటి అంశాలన్నీ కీలకమే.
అసలు పరీక్ష ఎన్నికల రోజే!
ప్రస్తుతం ముందస్తు ఓటింగ్ గణాంకాలు ఒక ఆసక్తికరమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. కానీ అవే తుది ఫలితమని భావించడం తొందరపాటే. రిపబ్లికన్ ఓటర్లు ఎన్నికల రోజున పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రావడం, డెమోక్రాట్లు ముందస్తు ఓటింగ్‌లో సాధించిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవడం.. రెండూ ఫలితాలను ప్రభావితం చేయగలవు.
ఈ మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు కాంగ్రెస్‌లోని రెండు సభలపైనా రిపబ్లికన్ల ఆధిపత్యాన్ని సవాలు చేయాలని చూస్తున్నారు. వారు గణనీయమైన స్థానాలను గెలుచుకుంటే, ట్రంప్ ప్రభుత్వానికి చట్టాల ఆమోదం, బడ్జెట్, ప్రభుత్వ విధానాల అమలు వంటి అంశాల్లో రాజకీయంగా మరిన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
అందుకే ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో అసలు ప్రశ్న ముందస్తు ఓటింగ్‌లో ఎవరు ఎక్కువగా కనిపిస్తున్నారన్నది మాత్రమే కాదు. ఎన్నికల రోజున ఓటు వేయడానికి వచ్చే ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అన్నదే. ఆ సమాధానం వెలువడే వరకు ఈ గణాంకాలు సంకేతాలే.. తీర్పు కాదు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








