ప్రబాస్ ‘ఫౌజీ’ టీజర్‌పై నేతాజీ వారసుడి ఆగ్రహం.. చరిత్రను వక్రీకరించారంటూ సంచలన డిమాండ్!
హిట్లర్‌తో నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంభాషణ.. మధ్యలో ప్రబాస్ సూపర్ స్పై పాత్ర! ‘ఫౌజీ’ టీజర్‌పై వివాదం ముదురుతోంది. టీజర్‌ను తొలగించి కొత్తది విడుదల చేయాలని నేతాజీ మునిమనవడు డిమాండ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదంపై ప్రబాస్ స్పందిస్తారా?
ప్రబాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ఫౌజీ’ టీజర్ సినిమాపై అంచనాలను పెంచడమే కాదు.. కొత్త వివాదానికి కూడా తెరతీసింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ చిత్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను కీలకమైన చారిత్రక సందర్భంలో చూపించారు. అయితే, అదే ఇప్పుడు అభ్యంతరాలకు కారణమైంది.
ఇవి కూడా చదవండి
నేతాజీని అడాల్ఫ్ హిట్లర్‌తో మాట్లాడుతున్నట్లు చూపించడంతోపాటు, ప్రబాస్ పోషిస్తున్న కల్పిత సూపర్ స్పై పాత్ర గురించి ఆయన గొప్పగా చెప్పినట్లు టీజర్లో చూపించారు. దీనిపై నేతాజీ మునిమనవడు, సామాజిక-రాజకీయ కార్యకర్త చంద్రకుమార్ బోస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించేలా ఉన్న ఈ టీజర్‌ను వెంటనే తొలగించాలని చిత్రబృందాన్ని కోరారు.
Dear Editor (s) @TheAakashavaani , when a movie is made it impacts generations. Netaji ‘s endorsement of a fictional character is depicting History in a distorted manner. Your’s truly hopes for @hanurpudi Garu to realise the sensitivity …
Netaji Zindabad !! Jai Hind !! … SS
— Shri. Suparno Satpathy (@SuparnoSatpathy) October 26, 2026
టీజర్‌ను తొలగించి కొత్తది విడుదల చేయాలంటూ డిమాండ్!
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నందిని సత్పతి మనవడు, రచయిత కలిందీ చరణ్ పాణిగ్రాహి మునిమనవడు సుపర్ణో సత్పతి కూడా ‘ఫౌజీ’ టీజర్‌పై స్పందించారు. టీజర్ అద్భుతంగా ఉందని, గూస్బంప్స్ తెప్పిస్తోందని ప్రశంసిస్తూనే.. చరిత్రతో కల్పనను కలపడం సరైన ఆలోచన కాదని అభిప్రాయపడ్డారు.
సుపర్ణో సత్పతి చేసిన పోస్టును రీపోస్ట్ చేసిన చంద్రకుమార్ బోస్ మరింత ఘాటుగా స్పందించారు. చరిత్రను కల్పనతో కలపడం నేరమని వ్యాఖ్యానిస్తూ, దర్శకుడు హను రాఘవపూడి, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ టీజర్‌ను తొలగించి, చరిత్రను వక్రీకరించని మరో టీజర్‌ను విడుదల చేయాలని కోరారు.
అంతేకాదు, ఈ విషయాన్ని ప్రబాస్ కూడా చదివి స్పందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం దర్శకుడి నిర్ణయంతోపాటు ప్రబాస్ స్పందనపైనా ఆసక్తిని పెంచుతోంది.
Mixing fiction with history is a crime. I hope @hanurpudi and his team @fauzithemovie / @MythriOfficial pull down this teaser , put out a new one and make sure that history is not distorted. Hope #Prabhas too gets to read this.
— Chandra Kumar Bose (@Chandrakbose) October 26, 2026
అసలు టీజర్లో ఏముంది?
ప్రబాస్ 47వ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ‘ఫైల్ నంబర్ 25’ పేరుతో ‘ఫౌజీ’ చిత్రబృందం ఈ వీడియోను విడుదల చేసింది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న 1942 నాటి బెర్లిన్ నేపథ్యంలో ఈ సన్నివేశాన్ని రూపొందించారు.
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ సహాయం కోరుతున్న నేతాజీని ఇందులో చూపించారు. భారతీయులు బానిసత్వానికి అలవాటు పడ్డారనే అర్థం వచ్చేలా హిట్లర్ వ్యాఖ్యానించగా.. నేతాజీ తీవ్రంగా స్పందిస్తారు.
తన వద్ద ఉన్న భారతీయ సూపర్ స్పై గురించి వివరిస్తారు. బ్రిటిష్ వారిపై పోరాటంలో జపాన్‌కు సాయపడిన ఆ గూఢచారి సింగపూర్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు. భగవద్గీత ఆధారంగా రూపొందించిన ఒక ప్రత్యేక కోడ్ గురించి కూడా ప్రస్తావిస్తారు. ఆ గూఢచారి ప్రస్తుతం కలకత్తాలో ఉన్నట్లు వెల్లడిస్తారు.
చివర్లో ప్రబాస్ సిగరెట్ తాగుతూ, భారీ తుపాకీతో కాల్పులు జరుపుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ సన్నివేశాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించినప్పటికీ, చారిత్రక వ్యక్తిని కల్పిత పాత్రను ప్రమోట్ చేసేలా చూపించడమే ఇప్పుడు అభ్యంతరాలకు ప్రధాన కారణమైంది.
కల్పిత కథకు చారిత్రక వ్యక్తులు ఆధారమైతే సమస్యేంటి?
సుపర్ణో సత్పతి అభిప్రాయం ప్రకారం, సినిమాలు కేవలం వినోదానికే పరిమితం కావు. అవి తరతరాల ప్రేక్షకులపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా నేతాజీ వంటి చారిత్రక వ్యక్తులను తెరపై చూపించినప్పుడు, వాస్తవ చరిత్రకు కల్పనకు మధ్య స్పష్టమైన తేడా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ‘ఫౌజీ’ ఒక కల్పిత కథతో రూపొందుతున్న సినిమా కాబట్టి, అందులోని సన్నివేశాలను అదే కోణంలో చూడాలని ప్రబాస్ అభిమానులు వాదిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో కల్పిత పాత్రలను సృష్టించడం సినిమాల్లో కొత్తేమీ కాదన్నది వారి వాదన.
అయితే చరిత్రను ఆధారంగా చేసుకున్న సినిమా కథకు ఎంతవరకు స్వేచ్ఛ ఉండాలి? ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించేందుకు చారిత్రక వ్యక్తుల మాటలను, పాత్రలను కల్పిత కథకు అనుగుణంగా మార్చవచ్చా? ఒకవైపు దర్శకుడి సృజనాత్మక స్వేచ్ఛ.. మరోవైపు చరిత్ర పట్ల బాధ్యత.. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా ఉండాలన్న చర్చకు ‘ఫౌజీ’ టీజర్ తెరతీసింది.
ప్రస్తుతం ఈ వివాదంపై దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందన కీలకంగా మారింది. చంద్రకుమార్ బోస్ డిమాండ్‌పై చిత్రబృందం టీజర్‌ను తొలగిస్తుందా? లేక తమ కథ కల్పితమని స్పష్టం చేస్తూ ముందుకు వెళ్తుందా? ప్రబాస్ ఈ వివాదంపై స్పందిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
మార్చి 19, 2027న విడుదల కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ‘ఫౌజీ’కి.. ఈ వివాదం ప్రచారపరంగా ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








