ట్రంప్ పార్టీ ఓడిపోతే ఏం జరుగుతుంది? గెలిస్తే ఏం మారుతుంది?
అమెరికాలో ఇప్పుడు ఎన్నికల వేడి మొదలైంది. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిగిలిన పాలనపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకోవడం లేదు. కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ, సెనేట్లలో ఎవరి ఆధిపత్యం ఉండాలన్నదే ఓటర్లు నిర్ణయించబోతున్నారు. ప్రస్తుతం ఈ రెండు సభల్లోనూ రిపబ్లికన్లకు ఆధిపత్యం ఉండటంతో ట్రంప్ తన విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు రాజకీయంగా అనుకూలమైన పరిస్థితి ఉంది. కానీ డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తే ఈ సమీకరణాలు మారిపోవచ్చు.
ఇప్పటివరకు ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ వచ్చిన కాంగ్రెస్‌లోనే ప్రతిపక్షం బలపడితే, వైట్‌హౌస్‌కు ప్రతి కీలక నిర్ణయానికీ రాజకీయ పోరాటం తప్పకపోవచ్చు. ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగించాలంటే నిధుల విషయంలో ప్రశ్నలు ఎదురుకావచ్చు. ఉక్రెయిన్‌కు అమెరికా సాయింని పునరుద్ధరించాలనే ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి రావచ్చు. ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాపైనా చర్చ తీవ్రమవుతుంది. ట్రంప్ ప్రతిపాదించిన భారీ రక్షణ బడ్జెట్‌కు కూడా అడ్డంకులు ఏర్పడవచ్చు.
అయితే, డెమోక్రాట్లు గెలిచినంత మాత్రాన ట్రంప్ అధ్యక్ష పదవి పోదు. ఆయనకు ఉన్న కార్యనిర్వాహక అధికారాలు కొనసాగుతాయి. మారేది ఏమిటంటే, ఆయన నిర్ణయాలను కాంగ్రెస్ ఎంతవరకు ప్రశ్నించగలదు, నిధుల కేటాయింపులపై ఎంత ప్రభావం చూపగలదు, ప్రభుత్వ అధికారులను ఎంతవరకు జవాబుదారీగా నిలబెట్టగలదు అన్నది. మరి డెమోక్రాట్లు కాంగ్రెస్‌లో పట్టు సాధిస్తే ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రావచ్చు?
ఇరాన్ యుద్ధానికి బ్రేకులు పడతాయా?
ఇరాన్‌తో యుద్ధం అమెరికా ఎన్నికల్లో అత్యంత కీలకమైన విదేశాంగ అంశాల్లో ఒకటిగా మారింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై సైనిక చర్యలు ప్రారంభించిన ట్రంప్ ప్రభుత్వం, యుద్ధాన్ని కొనసాగించడంపై కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలన్న డెమోక్రాట్ల డిమాండ్లను ఎదుర్కొంటోంది. యుద్ధాన్ని ఆపాలని లేదా కొనసాగించాలంటే చట్టసభల అనుమతి పొందాలని కోరుతూ డెమోక్రాట్లు ఇప్పటికే తీర్మానాలకు మద్దతు ఇచ్చారు. కొందరు రిపబ్లికన్లు కూడా ఒక తీర్మానానికి మద్దతు పలకడం ఈ అంశంపై పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయని చూపించింది.
డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో లేదా సెనేట్‌లో ఆధిపత్యం సాధిస్తే, యుద్ధానికి సంబంధించిన రక్షణ నిధులపై పరిమితులు విధించేందుకు ప్రయత్నించవచ్చు. ఇరాన్‌పై సైనిక చర్యల ఉద్దేశం ఏమిటి, యుద్ధాన్ని ఎంతకాలం కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది, దానికి ఎంత ఖర్చవుతోంది వంటి ప్రశ్నలపై అధికారులను బహిరంగంగా వివరణ కోరవచ్చు. ఇలా కాంగ్రెస్ ఒత్తిడి పెరిగితే ట్రంప్ ప్రభుత్వం తన సైనిక వ్యూహాన్ని సమర్థించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే, దీని అర్థం యుద్ధం వెంటనే ఆగిపోతుందని కాదు. అధ్యక్షుడికి సైనిక వ్యవహారాల్లో గణనీయమైన అధికారాలు ఉన్నాయి. కాంగ్రెస్‌లో డెమోక్రాట్లు గెలిచినా, యుద్ధానికి నిధులు ఆపే ప్రతిపాదనలకు అవసరమైన మద్దతు సంపాదించడం, చట్టపరమైన అడ్డంకులను అధిగమించడం అంత సులభం కాకపోవచ్చు.
అయినప్పటికీ, యుద్ధం కొనసాగించడంపై రాజకీయ ఒత్తిడి పెరగవచ్చు. అదే సమయంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గితే చమురు సరఫరా, ఇంధన ధరల విషయంలో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. యుద్ధం కొనసాగితే మాత్రం అమెరికాతో పాటు భారత్ వంటి చమురు దిగుమతి దేశాలకూ ధరల భారం తప్పకపోవచ్చు.
ఇవి కూడా చదవండి
ఉక్రెయిన్‌కు మళ్లీ అమెరికా సాయం అందుతుందా?
రష్యా దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు అమెరికా సాయం విషయంలోనూ కాంగ్రెస్ ఎన్నికల ప్రభావం కనిపించవచ్చు. ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు ప్రత్యక్ష ఆర్థిక, సైనిక సాయిని చాలావరకు నిలిపివేసిన నేపథ్యంలో, డెమోక్రాట్లు కాంగ్రెస్‌లో బలపడితే కొత్త సహాయ ప్యాకేజీలను చర్చకు తీసుకురావడానికి ప్రయత్నించవచ్చు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని భావించే రిపబ్లికన్ సభ్యుల సహకారం లభిస్తే ఈ ప్రయత్నాలకు మరింత బలం చేకూరవచ్చు.
డెమోక్రాట్లకు సభల అజెండాపై ఎక్కువ నియంత్రణ లభిస్తే ఏ బిల్లులను చర్చకు తీసుకురావాలి, ఎప్పుడు ఓటింగ్ జరగాలి అనే విషయంలో వారికి మరింత ప్రభావం ఉంటుంది. ఉక్రెయిన్‌కు ఆర్థిక, సైనిక సాయిని పునరుద్ధరించడంతో పాటు రష్యా ఇంధనంపై ఆంక్షలను సడలించే నిర్ణయాలను కూడా వారు ప్రశ్నించవచ్చు. అమెరికా నుంచి మద్దతు పెరిగితే ఉక్రెయిన్‌కు యుద్ధాన్ని కొనసాగించేందుకు అవసరమైన వనరులు సమకూరే అవకాశం ఉంటుంది.
కానీ ఇక్కడ మరో సమస్య ఉంది. ట్రంప్ ఒక బిల్లును వీటో చేస్తే, ఆ వీటోను అధిగమించడానికి కాంగ్రెస్‌లో రెండు సభలూ మూడింట రెండొంతుల మెజారిటీతో మళ్లీ ఆమోదించాలి. అందువల్ల డెమోక్రాట్లు గెలిచినా ఉక్రెయిన్‌కు సాయం వెంటనే పెరుగుతుందని చెప్పలేం. మరోవైపు అమెరికా మద్దతు పెరిగితే రష్యాతో ఉద్రిక్తతలు కొనసాగవచ్చని భావించే వర్గాలూ ఉన్నాయి. కాబట్టి ఉక్రెయిన్‌కు సాయం పునరుద్ధరణ అనేది కేవలం నిధుల అంశమే కాదు; యూరప్ భద్రత, రష్యాతో సంబంధాలు, అమెరికా అంతర్జాతీయ పాత్రతోనూ ముడిపడి ఉంటుంది.
ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాపై ఆంక్షలు వస్తాయా?
ఇజ్రాయెల్‌కు అమెరికా అందిస్తున్న సైనిక సాయం కూడా ఎన్నికల తర్వాత కీలక చర్చగా మారవచ్చు. గాజా యుద్ధంలో పాలస్తీనా పౌరుల మరణాలు, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో కొనసాగుతున్న హింస వంటి అంశాలపై డెమోక్రాట్లలో అసంతృప్తి పెరిగింది. ఇజ్రాయెల్‌కు సాయం పూర్తిగా నిలిపివేయాలని కోరేవారితో పాటు, భారీ బాంబుల వంటి నిర్దిష్ట ఆయుధాల సరఫరాపై పరిమితులు విధించాలని భావించే సభ్యులూ ఉన్నారు. ఇటీవల ఆర్థిక సంవత్సరంలో ఇజ్రాయెల్‌కు అమెరికా 3.8 బిలియన్ డాలర్ల సైనిక సాయం అందించింది.
డెమోక్రాట్లు కాంగ్రెస్‌లో ఆధిపత్యం సాధిస్తే, ఇజ్రాయెల్‌కు సాయం అందించే విధానాన్ని సమీక్షించాలని, కొన్ని ఆయుధాల సరఫరాకు షరతులు విధించాలని లేదా నిర్దిష్ట సహాయాన్ని నిలిపివేయాలని ప్రతిపాదించవచ్చు. దీనివల్ల ట్రంప్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు మద్దతు విషయంలో కాంగ్రెస్‌తో చర్చలు జరపాల్సిన పరిస్థితి రావచ్చు. ఇజ్రాయెల్‌కు అమెరికా అందించే సైనిక సహకారం కొనసాగాలా, ఏ రకమైన ఆయుధాలు అందించాలి, వాటి వినియోగంపై ఎలాంటి నిబంధనలు ఉండాలి వంటి అంశాలు మరింత చర్చకు వస్తాయి.
అయితే, అమెరికా–ఇజ్రాయెల్ సంబంధాలు ఒక్క ఎన్నికతో పూర్తిగా మారిపోవు. ఇజ్రాయెల్ అమెరికాకు కీలకమైన సైనిక, గూఢచార భాగస్వామి. ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడం, మధ్యప్రాచ్యంలో అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడం వంటి అంశాల్లో ఇజ్రాయెల్‌తో సహకారానికి ప్రాధాన్యం ఉంది. అందువల్ల డెమోక్రాట్లు గెలిచినా సైనిక సాయం మొత్తం నిలిచిపోతుందని చెప్పలేం. కానీ ఆయుధాల సరఫరాపై ఎక్కువ పరిశీలన, కొన్ని సహాయాలపై పరిమితులు, ఇజ్రాయెల్ ప్రభుత్వంపై మరింత దౌత్యపరమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.
రక్షణ బడ్జెట్‌కు కోతలు.. విదేశీ సాయికి మళ్లీ నిధులు?
ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన భారీ రక్షణ బడ్జెట్ పెంపు మరో కీలక అంశం. సైనిక బడ్జెట్‌ను 67 శాతం పెంచి 1.5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్‌లో ఇప్పటికే వివాదం నెలకొంది. డెమోక్రాట్లు ఇంత భారీ పెంపును వ్యతిరేకిస్తూ, ఇరాన్ యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కోతలు వంటి అంశాలను ప్రశ్నిస్తున్నారు.
డెమోక్రాట్లు కాంగ్రెస్‌లో బలపడితే రక్షణ బడ్జెట్ పెంపును పరిమితం చేయడానికి, సైనిక నిధులు ఎలా ఖర్చవుతున్నాయో పరిశీలించడానికి ప్రయత్నించవచ్చు. యుద్ధానికి ఎంత ఖర్చవుతోంది, ఆయుధాల కొనుగోళ్లకు కేటాయిస్తున్న నిధులు అవసరానికి తగినవేనా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల నుంచి ఎంత నిధులు తగ్గుతున్నాయి వంటి ప్రశ్నలు ముందుకు రావచ్చు. దీనివల్ల ట్రంప్ ప్రతిపాదించిన బడ్జెట్‌కు చర్చలు, సవరణలు, రాజకీయ అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇదే సమయంలో విదేశీ సాయిపై కూడా డెమోక్రాట్లు దృష్టి పెట్టవచ్చు. కాంగ్రెస్ ఆమోదించిన విదేశీ సహాయ నిధుల్లో బిలియన్ల డాలర్లను ట్రంప్ ప్రభుత్వం నిలిపివేయడం లేదా రద్దు చేయడం విమర్శలకు కారణమైంది. డెమోక్రాట్లు అధికారంలో బలపడితే నిలిపివేసిన నిధులను పునరుద్ధరించేందుకు, భవిష్యత్తులో మరిన్ని కోతలను అడ్డుకునేందుకు ప్రయత్నించవచ్చు. అయితే, రక్షణ బడ్జెట్లో మార్పులు చేయడం లేదా విదేశీ సాయిని తిరిగి పెంచడం కూడా కాంగ్రెస్ మద్దతు, అధ్యక్షుడి స్పందన, నిధుల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.
మనదేశంపై ప్రభావం ఏమిటి?
అమెరికా ఎన్నికలతో మనకేం సంబంధం అనుకుంటున్నారా? చాలా ఉంది! అక్కడ ట్రంప్ పార్టీ ఓడిపోయినా, గెలిచినా ఆ ప్రభావం భారత్‌లో పెట్రోల్ ధరల నుంచి మన విదేశాంగ విధానం వరకు కనిపించవచ్చు. ఇరాన్‌తో యుద్ధం తీవ్రత పెరిగితే చమురు ధరలు ఎగబాకే ప్రమాదం ఉంది. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం మారితే రష్యాతో అంతర్జాతీయ సమీకరణాలు మారవచ్చు. ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాపై నిర్ణయాలు మారితే మధ్యప్రాచ్య పరిస్థితులపైనా ప్రభావం పడొచ్చు. చివరికి వీటన్నింటి ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపై కూడా పడే అవకాశం ఉంది.
మరి ట్రంప్‌కు నిజంగానే అడ్డుకట్ట పడుతుందా?
డెమోక్రాట్లు కాంగ్రెస్‌లో గెలిస్తే ట్రంప్ పాలనకు రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలినట్టవుతుంది. ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు, బడ్జెట్ చర్చలు, సైనిక సాయిపై నియంత్రణ ప్రయత్నాలు, ఉన్నతాధికారుల నియామకాలపై ఒత్తిడి వంటి మార్గాల్లో ఆయన విధానాలను ప్రశ్నించే అవకాశం పెరుగుతుంది. సెనేట్‌లోనూ డెమోక్రాట్లకు మెజారిటీ వస్తే న్యాయమూర్తులు, ఉన్నత ప్రభుత్వ పదవులకు నియామకాల విషయంలో కూడా వారి ప్రభావం పెరుగుతుంది.
చివరికి…
అమెరికా ఓటర్లు ఇచ్చే తీర్పు వైట్‌హౌస్‌లోని అధ్యక్షుడిని మార్చకపోయినా, ఆయన నిర్ణయాలను ప్రశ్నించే శక్తి ఎవరికి ఉంటుందో మార్చగలదు. ఆ మార్పు ఇరాన్ యుద్ధం నుంచి ఉక్రెయిన్ భవిష్యత్తు వరకు, మధ్యప్రాచ్య భద్రత నుంచి అమెరికా ఖర్చుల వరకు అనేక అంశాలపై ప్రభావం చూపవచ్చు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








