దీపావళి నేపథ్యంలో 2 కోట్ల ‘‘దివాలీ ఫరెవర్’’ స్టాంపులను ముద్రించిన అమెరికా పోస్టల్
భారతీయులకు అత్యంత పవిత్రమైన దీపావళి పండగను పురస్కరించుకొని యూఎస్ పోస్టల్ సర్వీస్ (USPS)దాదాపు 2 కోట్ల ‘‘దివాలీ ఫరెవర్’’ స్టాంపులను ముద్రించింది. భారతీయ సమాజం నుంచి వస్తున్న విజ్ఞప్తులు, మొదట విడుదల చేసిన స్టాంప్ కి వచ్చిన ప్రజాదరణను దృష్టిలో పెట్టుకొని ఈ 2 కోట్ల స్టాంపులను విడుదల చేసింది.
ఈ స్టాంప్‌లో ఊదా రంగు (purple) నేపథ్యంలో హ్యూస్టన్‌కు చెందిన కళాకారిణి సంగీత భూతడ రూపొందించిన శక్తివంతమైన ముగ్గు డిజైన్ ఉంది. దాదాపు 30 ఏళ్లుగా ముగ్గులు వేస్తున్న భూతడ, ఈ కళాఖండాన్ని రూపొందించడానికి పిండి ఆధారిత రంగుల పొడి మరియు రంగు ఇసుకను ఉపయోగించినట్లు యుఎస్పిఎస్ తెలిపింది.దీపావళి పండుగకు ఉన్న ప్రాముఖ్యత కారణంగానే ఎరుపు మరియు నారింజ వంటి ప్రకాశవంతమైన రంగులను ఎంచుకున్నట్లు భూతడ చెప్పారు.ఈ స్టాంపులు పోస్ట్ ఆఫీస్‌లలో మరియు ఆన్లైన్లో 20 స్టాంపుల షీట్ల రూపంలో విక్రయించబడుతున్నాయి. ‘
వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో (ఇండియన్ ఎంబసీ) రంగురంగుల రంగవల్లి (ముగ్గు) డిజైన్‌తో కూడిన ఈ స్టాంప్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా యూఎస్ పోస్టల్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ సాహిబానీ గంభీర్ మాట్లాడుతూ.. రెండో స్టాంప్ ను రూపొందించాలని భారతీయ సమాజం నుంచి చాలా విజ్ఞప్తులు వచ్చాయని తెలిపారు. మొదటి స్టాంప్ లాగే ఇది కూడా చాలా ఆదరణ పొందుతుందని తమకు ప్రగాఢ విశ్వాసంతో వున్నామన్నారు. అందుకే కొంచెం ఎక్కువ పరిమాణంలోనే స్టాంపును ముద్రించామన్నారు.
యుఎస్పిఎస్ దీపావళి సందర్భంగా విడుదల చేసిన రెండవ స్టాంప్ మాత్రమే ఇది. మొదటి స్టాంప్‌ను 2016లో విడుదల చేశారు మరియు ఇది మిలియన్ల కొద్దీ అమ్ముడై భారతీయ సమాజంలో విశేష ఆదరణ పొందిందని గంభీర్ చెప్పారు. స్టాంప్ సేకర్లు (Stamp collectors) కూడా ఈ కొత్త స్టాంప్‌ను కొనుగోలు చేస్తారని భావిస్తున్నారు.
ఇక.. అమెరికాలోని భారతీయులు అమెరికానే తమ సొంత నివాసంగా భావిస్తున్నారని, భారతీయ అమెరికన్లు దీపావళిని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా అన్నారు. భారతీయ అమెరికన్లు సమాజాన్ని అనుసంధానిచ్చే వ్యక్తులు అని, అందుకే యూఎస్ కి, భారత్ కి మధ్య వారు సజీవ వారధిగా వుంటారన్నారు. భారతీయ అమెరికన్ డయాస్పోరా మరియు విస్తృత అమెరికన్ ప్రజలతో భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి ఈ స్టాంప్ ఒక చక్కని అవకాశమని అభివర్ణించారు.








