ఇరాన్‌పై మరో ‘ఎపిక్ ఫ్యూరీ’ .. ట్రంప్ హింట్..!
పశ్చిమాసియాలో మరోసారి భీకర పోరు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటివరకూ హర్మూజ్ దగ్గర పోర్టులను దిగ్భందిస్తూ, ఇజ్రాయెల్ సాయంతో దాడులు చేస్తున్న అమెరికా.. మరోసారి ఎపిక్ ప్యూరీ దాడులకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా సంకేతమిచ్చారు.
టెహ్రాన్‌తో ఎలాంటి ఒప్పందం కుదరకపోతే తాము మరోసారి సైనిక చర్యకు దిగే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంకేతాలిచ్చారు. మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడా ర్యాలీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘పశ్చిమాసియాలో మరో చిన్న స్థాయి ఎపిక్ ఫ్యూరీ (Epic Fury) జరగొచ్చు’’ అని ట్రంప్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ వారాంతంలో ఇరాన్ (Iran)పై దాడులు జరిగే అవకాశం ఉందని తుర్కియేలోని అమెరికా రాయబారి టామ్ బారక్ ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో వ్యాఖ్యలు చేశారు. తొలుత వాటిని ట్రంప్ తోసిపుచ్చారు.
‘‘ఓ మా రాయబారా..? ఆయన బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి అనుకుంటా..? కానీ, ఆ దాడుల వ్యాఖ్యల గురించి నాకు ఏమీ తెలియదు’’ అని అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు స్వయంగా ట్రంప్ (Donald Trump) దాడుల గురించి హింట్ ఇవ్వడం గమనార్హం. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ పరిస్థితులు ఉత్కంఠగా మారాయి.
ఇరాన్ వార్నింగ్..
అమెరికా హెచ్చరికల వార్తలపై ఇరాన్ (Iran) తీవ్రంగా స్పందించింది. నిప్పుతో చెలగాటమాడొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. తమపై మరోసారి దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లోని సముద్రగర్భంలో ఉన్న కమ్యూనికేషన్ కేబుళ్లను ధ్వంసం చేస్తామని ఇప్పటికే హెచ్చరించింది. ‘‘ఇరాన్‌పై దాడి జరిగితే.. ఇక ఎలాంటి హద్దులు ఉండవు. కేబుళ్లు (undersea cables), మిలిటరీ స్థావరాలు.. వేటినీ వదలబోం’ అని పేర్కొంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట అమెరికా దాడులు చేసింది.. అప్పటి నుంచి పశ్చిమాసియాలో ఏదో ఒక రూపంలో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. చమురు సరఫరాకు అంతరాయాలు ఏర్పడటంతో ప్రపంచాన్ని ఇంధన వ్యయాల భయాలు వెంటాడుతున్నాయి.








