బ్రహ్మోస్ కోసం ప్రపంచదేశాల బారులు.. డీల్ దిశగా యూఏఈ..!
భారత్-రష్యా సంయుక్తంగా రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ క్షిపణికి అంతర్జాతీయంగా డిమాండ్ వెల్లువెత్తుతోంది. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ప్రతీదేశం తన భద్రతను రివ్యూ చేస్తోంది. తమకు ఓ బ్రహ్మాస్త్రం లాంటి మిస్సైల్ వ్యవస్థ కావాలని కోరుకుంటోంది. అయితే ఇలాంటి దశలో ఆపరేషన్ సిందూర్.. ఆ దేశాలకు చక్కని అవకాశంలా మారింది. రోజులవ్యవధిలో పాక్ రక్షణ రంగం నడ్డి విరిచి కాళ్ల బేరానికి తెచ్చిన బ్రహ్మోస్ రక్షణ సామర్థ్యం.. వారికి అవగతమైంది. దీంతో కొంటే బ్రహ్మోస్ లాంటి క్షిపణి .. కాదు కాదు బ్రహ్మోస్ మిస్సైల్ కావాలంటున్న దేశాల సంఖ్య పెరిగిపోతోంది.
ఇప్పటికే చైనా పొరుగున ఉన్న పలుదేశాలకు ఇండియా .. బ్రహ్మోస్ ను సరఫరా చేస్తోంది కూడా. ఈ తరుణంలో ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ తో పడరాని పాట్లు పడుతున్న గల్ఫ్ దేశాలు.. బ్రహ్మోస్ వైపు ఆశగా చూస్తున్నాయి. మరీముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే.. ఈ దిశగా ఓ అడుగు ముందుకేసింది. భారత్ తో బ్రహ్మోస్ డీల్ పై చర్చలు జరుపుతోంది. దీనికి తోడు..మేడిన్ ఇండియా ఆకాశ్‌తీర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తమ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు యూఏఈ ఆసక్తి కనబరుస్తున్న తరుణంలో ఈ చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ వేగంగా ముందుకు సాగుతున్నాయి. భారత్-రష్యాల సంయుక్త భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణులలో ఒకటిగా గుర్తింపు పొందింది. శబ్దవేగం కంటే మూడు రెట్లు వేగంతో (మాక్ 3) ప్రయాణించగల ఈ క్షిపణిని భూమి, సముద్రం మరియు గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. దీని పరిధి సుమారు 290 కిలోమీటర్లు. ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) అభివృద్ధి చేసిన ‘ఆకాశ్‌తీర్’, గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పులను వేగంగా పసిగట్టి స్పందించే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ వ్యవస్థ.
సాంప్రదాయకంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే యూఏఈ, ఇప్పుడు తన రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల వైపు కూడా దృష్టి సారిస్తోంది. యూఏఈ వద్ద ఇప్పటికే అమెరికా తయారీ థాడ్, పేట్రియాట్ వంటి శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వీటికి అదనంగా ఆకాశ్‌తీర్ వ్యవస్థను జోడించడం ద్వారా తమ కమాండ్ అండ్ కంట్రోల్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్రహ్మోస్ జాయింట్ వెంచర్లో రష్యా భాగస్వామిగా ఉన్నందున, ఈ విక్రయానికి మాస్కో ఆమోదం తప్పనిసరి. అయితే రష్యా-యూఏఈ మధ్య ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఇది అడ్డంకి కాకపోవచ్చని తెలుస్తోంది.
ఈ చర్చలు భారత్-యూఏఈ మధ్య బలపడుతున్న వ్యూహాత్మక సంబంధాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2026 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ 4 బిలియన్ డాలర్లకు పైగా విలువైన రక్షణ పరికరాలను ఎగుమతి చేసింది. ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించిన భారత్… వియత్నాం, ఇండోనేషియాలతో కూడా ఒప్పందాల దిశగా చర్చలు జరుపుతోంది.








