కాకినాడ జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ట్విస్ట్..!
కాకినాడ(Kakinada) జిల్లాలో పెను సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అత్యంత కీలకమైన మలుపు తిరిగింది. ఈ నెల 6న చిన్నారితో పాటు అదృశ్యమై, ఆ తర్వాత అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన పెంపుడు కుక్క మృతికి గల కారణాలను పశువైద్యులు వెల్లడించారు. జ్ఞానేశ్వరి అదృశ్యమైన రోజే ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క.. మూడు రోజుల తర్వాత ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. అయితే, ఈ నెల 13న ఆ కుక్క అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో కేసులో ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు.
ఇందులో భాగంగానే ఈ నెల 14న కుక్కకు పోస్ట్‌మార్టం నిర్వహించి, కీలక నమూనాలను (Samples) వైజాగ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. తాజాగా అందిన పోస్టుమార్టం నివేదికలో ఆ పెంపుడు కుక్క ఎలాంటి విషప్రయోగానికి గురికాలేదని, కేవలం అనారోగ్య కారణాల వల్లే చనిపోయిందని వైద్యులు స్పష్టం చేశారు. పెంపుడు కుక్క మృతిపై మిస్టరీ వీడినప్పటికీ, అసలు చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడ ఉందనే ప్రశ్న ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
ఈ నెల 6వ తేదీ నుండి అదృశ్యమైన చిన్నారి కోసం పోలీసులు, ప్రత్యేక బృందాలు కాకినాడ పరిసర ప్రాంతాలతో పాటు అటవీ, గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. పెంపుడు కుక్క అనారోగ్యంతో చనిపోవడంతో, చిన్నారి ఆచూకీ కనుగొనడానికి పోలీసులు ఇప్పుడు సాంకేతిక ఆధారాలు, స్థానిక విచారణపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు. అటు చిన్నారి తల్లి కూడా అనారోగ్యానికి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అధికారులు వెల్లడించారు.








