ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలకు బ్రేక్, జూన్ 26 అర్ధరాత్రి నుంచే షట్‌డౌన్..!
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. సిస్టమ్ అప్‌గ్రేడేషన్ మరియు సాంకేతిక నిర్వహణ పనుల (System Upgrade & Maintenance) కారణంగా ఈపీఎఫ్ఓ ఆన్లైన్ పోర్టల్ సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలగనుంది జూన్ 30 వరకు పలు సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండవని అధికారులు స్పష్టం చేశారు. ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటన ప్రకారం జూన్ 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి జూన్ 29వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు ఆన్లైన్ సేవలను పూర్తిగా నిలిపివేయనున్నారు.
ఆ తర్వాత జూన్ 30న కూడా పోర్టల్ సేవల్లో పాక్షికంగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ సుదీర్ఘ షట్‌డౌన్ సమయంలో వెబ్సైట్ ద్వారా జరిగే ఎలాంటి లావాదేవీలు ప్రాసెస్ కావు. ఈ మూడు రోజుల పాటు ఈపీఎఫ్ఓ అధికారిక పోర్టల్‌లో పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెకింగ్, పాస్‌బుక్ డౌన్లోడ్, పీఎఫ్ అడ్వాన్స్ అమౌంట్ విత్‌డ్రా క్లెయిమ్‌లు వంటి కీలక సేవలు నిలిచిపోతాయి.
వీటితో పాటు ఆన్లైన్ ద్వారా పీఎఫ్ అకౌంట్ బదిలీ ప్రక్రియ, కేవైసీ (KYC) అప్డేట్, ప్రొఫైల్ మార్పులు మరియు ఉమంగ్ (UMANG) యాప్ ద్వారా పొందే ఈపీఎఫ్ సేవలు కూడా పనిచేయవని అధికారులు వెల్లడించారు. పీఎఫ్ ఖాతాదారులు తమకు అవసరమైన అత్యవసర క్లెయిమ్‌లు, బ్యాలెన్స్ వెరిఫికేషన్ వంటి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచించింది. పోర్టల్‌ను మరింత వేగంగా, సురక్షితంగా మార్చేందుకే ఈ సాంకేతిక నిర్వహణ పనులు చేపడుతున్నామని, యూజర్లు సహకరించాలని కోరింది.








