ఆపరేషన్ సిందూర్ లో అత్యున్నత త్యాగం చేసిన సైనికుల పేర్ల ప్రకటన
ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగం చేసిన ఆరుగురు సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో మనదేశం కొందరు వీర జవాన్లను కోల్పోయింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐదుగురు ఆర్మీ అధికారులతో పాటు ఓ అగ్నివీర్ వీరమరణం పొందారు. వారి పేర్లను నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ప్రాణాలు కోల్పోయిన వీరుల పేర్లను న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకంలో ప్రత్యేక గ్రానైట్ శిలలపై చెక్కనున్నారు. వీరిలో ఇద్దరికి ఇప్పటికే అత్యున్నత శౌర్య పురస్కారాలు కూడా లభించాయి.
అమరవీరుల పేర్లు ఇవే…
సుబేదార్ మేజర్ పవన్ కుమార్ – ప్రధాన కార్యాలయం, 10 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్
రైఫిల్మన్ సునీల్ కుమార్ – 4వ బెటాలియన్, జమ్మూ,కశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ
లాన్స్ నాయక్ దినేష్ కుమార్ – 5 ఫీల్డ్ రెజిమెంట్
అగ్నివీర్ మురళీ నాయక్ – 851 లైట్ రెజిమెంట్
హవీల్దార్ సునీల్ కుమార్ సింగ్ – 237 ఫీల్డ్ వర్క్‌షాప్
సార్జెంట్ సురేంద్ర కుమార్ – భారత వైమానిక దళం 39 వింగ్.
2025 ఏప్రిల్ 22 న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈమినీస్విట్జర్లాండ్గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై సమీపంలోని అడవిలో నుంచి వచ్చిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.








