భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలి : మంత్రి లోకేష్
షైనింగ్ స్టార్లే మా బ్రాండ్ అంబాసిడర్లు!
దేశం మొత్తం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలి
వచ్చే ఏడాది 2లక్షలమంది ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు రావాలి
విద్యార్థికోణం నుంచే విద్యాశాఖలో సంస్కరణలు చేపట్టాం
ప్రభుత్వ స్కూళ్లలో సీట్లకు రికమండేషన్ అడిగే రోజులు వచ్చాయి
షైనింగ్ స్టార్స్ సత్కార కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్
తాడేపల్లి: ఇప్పుడు మనం బెస్ట్ టీచర్లను సింగపూర్, ఫిన్ లాండ్ కి పంపుతున్నాం. అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. నా కోరిక ఒక్కటే. భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాట్లాడాలి. వచ్చే ఏడాది రెండు లక్షల మంది ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలి, షైనింగ్ స్టార్లే మా బ్రాండ్ అంబాసిడర్లని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ఏడాది పదోతరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు కనబర్చిన విద్యార్థులను పాఠశాల విద్యాశాఖ తరపున మంత్రి లోకేష్ తాడేపల్లిలోని సిఎస్ఆర్ ఫంక్షన్ హాలు వేదికగా ఘనంగా సత్కరించారు. 55మంది టెన్త్ షైనింగ్ స్టార్లకు….రూ. 30వేలు ప్రైజ్ మనీ, మెడల్, సర్టిఫికేట్, 61మంది ఇంటర్మీడియట్ షైనింగ్ స్టార్లకు ల్యాప్ ట్యాప్, మెడల్ అందజేశారు.
మీరు గెలిచారు, నన్ను గెలిపించారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… షైనింగ్ స్టార్స్… మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అబ్దుల్ కలాం గారు చెప్పిన ఒక మాట చెప్పాలనిపించింది. నిద్రలో కనిపించేది కల కాదు… కల మిమ్మల్ని నిద్రపోనివ్వదు. నిద్రపోకుండా మీరు పడిన కష్టం మిమ్మల్ని షైనింగ్ స్టార్స్ గా నిలబెట్టింది. మీరు గెలిచారు…నన్ను గెలిపించారు. మన విద్యావ్యవస్థను గెలిపించారు. మీరు పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. మీకు తక్కువ మార్కులు వస్తే నాకు సీఎం గారు తక్కువ మార్కులు వేస్తారు. షైనింగ్ స్టార్స్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారు. నాకు ఎక్కువ మార్కులు పడేలా చేసారు. మీ పెర్ఫార్మెన్స్ వల్ల మంత్రిగా నా గౌరవంతోపాటు 2లక్షలమంది టీచర్ల గౌరవం కూడా పెరిగింది. గతంలో ప్రభుత్వ స్కూళ్లంటే చిన్నచూపు ఉండేది. చరిత్ర తిరగరాసిన ఘనత మీ అందరిది. జులైలో మెగా పిటిఎం నిర్వహిస్తాం. మొదటి పిటిఎంలో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తెస్తానని చెప్పా. మీ అందరి కృషి, కష్టంతో ఆ మాటను సుసాధ్యం చేశా.
విద్యాశాఖ వ్యవసాయం లాంటిదే!
విద్యాశాఖ వ్యవసాయం లాంటిది, చాలా కష్టమైంది. ఫలితాలు వెంటనే రావు. ప్రతిరోజు నీళ్లు పోయాలి, ఎరువు వేయాలి, పంట చేతికొచ్చినపుడు రైతులకు కలిగిన ఆనందం ఈరోజు నాకు కలుగుతోంది. ఇంకా కష్టపడాలి, పనిచేయాలి, కలసికట్టు సరికొత్త చరిత్ర సృష్టించాలి. ఈరోజు విద్యార్థులు రాసిన డ్రీమ్ వాల్, గ్రాటిట్యూడ్ వాల్స్ చూశాను. విద్యార్థులు డాక్టర్, ఇంజనీర్, ఐఎఎస్ అవుతానని రాశారు. ఏ ఒక్కరూ రాజకీయ నాయకుడ్ని అవుతా, సమాజాన్ని మారుస్తానని రాయలేదు. యువత రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో మార్పు సాధించాలని కోరుకుంటున్నా. మొదటి సారి ప్రభుత్వ పాఠశాలల పిల్లల ఫోటోలు పేపర్ అడ్వర్టైజ్మెంట్ లో చూసినప్పుడు నాకు చెప్పలేని ఆనందం కలిగింది. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 1.06లక్షలమంది వచ్చారు. ఆ క్రెడిట్ అంతా ఇక్కడున్న షైనింగ్ స్టార్లదే.
నా డ్రీమ్ ను మీరు సాకారం చేశారు
ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ మన సిబిఎన్ గారు. ప్రభుత్వ పాఠశాలలకు షైనింగ్ స్టార్స్ బ్రాండ్ అంబాసిడర్లు. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. మీ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసాను. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ను తయారు చెయ్యాలని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాం. నేను ఫస్ట్ టైమ్ మెగా పిటిఎం పెట్టినప్పుడు చెప్పాను. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఎలాంటి ప్రకటనలు ఇస్తాయో అలానే ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సక్సెస్ కూడా సెలబ్రేట్ చేస్తానని చెప్పారు. నా డ్రీం మీరు సాకారం చేసారు. మీ ఫోటోలతో ప్రకటన ఇచ్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో స్కూళ్ల కోసం ఎమ్మెల్యేల రికమెండేషన్ కోరే రోజు వస్తుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పా. మంగళగిరి నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి వెళితే ఒక తల్లి నాతో నిడమర్రు స్కూలులో సీటు కావాలని గొడవపడింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఇలాగే తయారు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. జీవితంలో బెస్ట్ ఇన్వెస్టిమెంట్ ఎడ్యుకేషన్. మెటీరియల్ గా సాధించినవి ఏదో ఒకరోజు మనవద్ద నుంచి పోవచ్చు. మనవద్ద నుంచి ఎవరూ తీసుకెళ్లలేనిది విద్య.
ప్రభుత్వ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డులు
ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డులు చూసే రోజు వచ్చింది. షైనింగ్ స్టార్స్ విజయం వెనుక టీచర్ల కృషి ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఉంది. ఎవరైనా ఒక సబ్జెక్ట్ లో వీక్ గా ఉంటే స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఫైనల్ గా ఎగ్జామ్స్ లో అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఈ ఫలితం వెనుక ఎంతో మంది కష్టం ఉంది. ఇదంతా ఒక్కరోజులో అవ్వలేదు…ఒక నెలలో అవ్వలేదు…విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురవడానికి నాకు రెండేళ్ళు పట్టింది. నేను విద్యామంత్రి అయినపుడు పలువురు సౌకర్యాల గురించి అడిగారు. అందరూ హార్డ్ వేర్ బాగుంటే చాలు అనుకుంటారు.. హార్డ్ వేర్ అంటే బిల్డింగ్స్, ఫ్యాన్లు, టాయిలెట్స్. వాటితోపాటు సాఫ్ట్ వేర్ కూడా ముఖ్యమే. సాఫ్ట్వేర్ అంటే నాణ్యమైన విద్య. మంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి రోజు నుండే నేను ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ – లీప్ మిషన్ స్టార్ట్ చేశాను, లీప్ యాప్ తెచ్చాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్టూడెంట్ కిట్ తెచ్చాం. విద్యాశాఖలో రాజకీయ రంగులు ఉండకూడదని నిర్ణయం తీసుకున్నా. గతంలో టెక్స్ట్ బుక్ లో ముఖ్యమంత్రి, మంత్రి, అధికారుల సందేశాలు ఉండేవి, వాటన్నింటినీ తీసేశాం.
విద్యార్థుల కోణం నుంచే సంస్కరణలు
నేను తీసుకొచ్చిన ప్రతి సంస్కరణ విద్యార్దుల కోణంలో ఆలోచించి తీసుకున్నాం. విద్యార్ధులను సెంటర్ ఆఫ్ యూనివర్స్ గా పెట్టుకొని పని చేసాం. వన్ క్లాస్ వన్ టీచర్ గేమ్ ఛేంజర్ గా తీసుకున్నాం. ఇప్పుడు 10వేల స్కూళ్లలో వన్ క్లాస్ వన్ టీచర్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కరిక్యులం మార్చాం. డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ గారి పేరుతో స్టూడెంట్ కిట్ ఇస్తున్నాం. డొక్కా సీతమ్మ గారి పేరుతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఇంకా ఇంప్రూవ్ చేయాలని విద్యార్థులు రాశారు. మొదటి పిటిఎం బాపట్లలో జరిగింది. పిల్లలు తిన్న భోజనమే సిఎం తిన్నారు. ఆరోజు ముఖ్యమంత్రి పిల్లలకు పెట్టే భోజనం క్వాలిటీ మార్చాలన్నారు. ఈరోజు ఫైన్ రైస్ తెచ్చాం, కడప కలెక్టర్ ఆధ్వర్యంలో స్మార్ట్ కిచెన్ తెచ్చాం. సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని కేంద్రం కూడా పోత్సహిస్తోంది. ఇంకా ఇంప్రూవ్ చేసే బాధ్యత తీసుకుంటాం. త్వరలో రాష్ట్రం మొత్తం సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం మిల్లెట్ చిక్కీ ప్రవేశపెట్టాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. మెగా డిఎస్సీ నిర్వహించి 16వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. నో బ్యాగ్ డే అమలుచేసి విద్యార్థి ఆల్ రౌండ్ డెవలప్ మెంట్ కోసం కృషి చేస్తున్నాం. పాసివ్ లెర్నింగ్ నుంచి యాక్టివ్ లెర్నింగ్ కు మార్చడానికి క్లిక్కర్ టెక్నాలజీ తీసుకొచ్చాం. త్వరలో ఎఐ ట్యూటర్ ను కూడా తీసుకొస్తున్నాం. సంస్కరణల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో గతఏడాది పదోతరగతి ఉత్తీర్ణతాశాతం 72.8శాతం నుంచి 78.39 శాతానికి పెరిగింది.
విలువలులేని సమాజం ప్రమాదకరం
విలువలు లేని సమాజం దేశానికి ప్రమాదం. నైతిక విలువలు నేర్పడం చాలా ముఖ్యం. అందుకే చాగంటి కోటేశ్వర్ రావు గారిని విలువ ఆధారిత విద్యకి సలహాదారుగా నియమించాం. ఆయన చెప్పిన ఒక మాట నాకు బాగా గుర్తు ఉండిపోయింది. అమ్మకు చెప్పలేని పని చేయొద్దు. వినడానికి చాలా సింపుల్ గా ఉంది. కానీ, చాలా పవర్ ఫుల్ అది. ఒక పనిచేసే ముందు ఇది మన అమ్మకి చెప్పగలమా లేదా అని ఆలోచించుకుంటే సమాజంలో చాలా మార్పు వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం మహిళల్ని గౌరవించడం. కేవలం చట్టాల వల్ల రక్షణ రాదు. మార్పు ఇంటి నుండి మొదలు కావాలి. ఇప్పటికి కొంతమంది మహిళల్ని అవమానించే మాటలు మాట్లాడుతున్నారు. గాజులు తొడుక్కున్నావా, చీరకట్టుకున్నావా, అమ్మాయిలా ఏడవొద్దు. ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే ఆపమని గట్టిగా చెప్పండి. మహిళల్ని గౌరవించడం చిన్నప్పటి నుండే నేర్పిస్తున్నాం.మెగా పీటీఎం జరిగినప్పుడు తల్లికి వందనం చేస్తున్నాం.
పాఠశాలల్లో నో పాలిటిక్స్
నేను విద్యాశాఖ మంత్రి అయ్యినప్పుడు తీసుకున్న మొదటి నిర్ణయం పాఠశాలల్లో రాజకీయాలు వద్దు. బ్యాగ్ మీద నో బొమ్మ…బెల్ట్ మీద నో బొమ్మ…గుడ్డు మీద నో బొమ్మ…స్కూలులో నో బొమ్మ… నాకు ఫోటో పిచ్చి లేదు. టెక్స్ట్ బుక్స్ లో కూడా నా ఫోటో లేదు.. సీఎం గారి ఫోటో లేదు. రాజకీయ కార్యక్రమాలకి ఇప్పుడు స్కూళ్లలో పర్మిషన్ ఇవ్వడం లేదు. మీరు లైఫ్ లో చాలా సవాళ్లు ఎదుర్కొంటారు. నా లైఫే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలి. కలసికట్టుగా ముందుకు తీసుకెళ్తేనే సమాజంలో మార్పు వస్తుంది. మార్పుకు మీరు దివిటీలు కావాలి. మీ జీవన ప్రయాణంలో అనేక సవాళ్లు వస్తాయి. అందుకు నేనే ఉదాహరణ. ఇదే నియోజకవర్గంలో 2019లో పోటీచేసి 5300 ఓట్లతో ఓడిపోయా. తొలిరోజు బాధ, ఆవేదన కలిగాయి. రెండోరోజు నుంచి కసి పెంచాయి. అయిదేళ్లు కష్టపడి పనిచేశా, 91వేల మెజారిటీతో గెలిపించారు. 1985 తర్వాత గెలవని నియోజకవర్గం ఇది. నేను కోరుకుంటే మరో నియోజకవర్గానికి వెళ్లొచ్చు. చాలెంజ్ గా తీసుకున్నాను.
ప్రతివిద్యార్థిపై ప్రభుత్వ ఖర్చు చేస్తోంది
జీవితంలో కష్టాలు వస్తాయి, అధిగమించే శక్తి కూడా దేవుడు మనకు ఇస్తాడు. తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడి మిమ్మల్ని చదివిస్తున్నారు. దయచేసి ఇది మరువద్దు. జీవన ప్రయాణంలో అనేక దెబ్బలు తగులుతాయి. ఫెయిల్ అంటే ఫస్ట్ ఎటెంప్ట్ ఇన్ లెర్నింగ్. తప్పును ఎంత త్వరగా సరిదిద్దుకుంటామన్నదే ముఖ్యం. విద్యార్థులు ఒక సబ్జెక్టు ఫెయిలైతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనివల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించాలి. జీవితంలో అనేక ఎదురు దెబ్బలు తగులుతాయి. కష్టపడటానికి ప్రత్యామ్నాయం లేదు. దేశం కోసం ప్రధాని మోడీజీ ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం లక్షరూపాయలు ఖర్చుపెడుతోంది. ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. మీ స్కూలును మర్చిపోవద్దు. మీకు చాన్స్ దొరికినపుడు మీ వంతు సహాయం ఆ పాఠశాలకు అందజేయాలని మంత్రి లోకేష్ విజ్జప్తిచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ తమీమ్ అన్సారీయా, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు.








