అమెరికా వరదల్లో పర్చూరు యువకుడు గల్లంతు
US : అమెరికాలో వచ్చిన భారీ వరదలకు పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన యువకుడు గల్లంతయ్యాడు. గ్రామానికి చెందిన దొప్పలపూడి రాంబాబు, అనురాధ దంపతుల పెద్ద కుమారుడు వెంకటేష్ (33) ఐదేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్ళాడు. ప్రస్తుతం అతను ఓక్లహామా సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు.
భారీ వరదలు..
కొద్దిరోజుల క్రితం వెంకటేష్ కాన్సాస్ వెల్లింగ్టన్ ప్రాంతానికి వెళ్లగా, అక్కడ భారీ వరదలు సంభవించాయి. వరద ప్రవాహంలో అతను కొట్టుకుపోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వెంకటేష్ ప్రయాణించిన కారు, అందులోని బ్యాగు లభించినప్పటికీ, అతని ఆచూకీ మాత్రం తెలియలేదు. ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
సహాయం కోరిన ఎమ్మెల్యే ఏలూరి..
ఈ దురదృష్టకర విషయం తెలుసుకున్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వెంటనే స్పందించారు. వెంకటేష్ ఆచూకీని త్వరగా గుర్తించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని కోరుతూ కేంద్రమంత్రులు రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌లకు లేఖలు రాశారు. ఈ ఘటనతో దేవరపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.








