సాంకేతిక రంగంలో తెలుగు తేజం.. అమెరికా వేదికపై సోమ సోమశేఖర్ సేవలకు గుర్తింపు
Soma Somasegar: మైక్రోసాఫ్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్ , ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ శివరామకృష్ణన్ “సోమ” సోమశేఖర్, సాంకేతిక రంగం, పారిశ్రామికవేత్తగా , సమాజ సేవలో చేసిన కృషికి గాను అమెరికా ప్రతినిధుల సభలో (US House of Representatives) అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
కాంగ్రెస్ సభ్యురాలి ప్రశంసలు..
వాషింగ్టన్ కాంగ్రెస్ సభ్యురాలు సుజాన్ డెల్బెనె సభలో మాట్లాడుతూ, సోమశేఖర్ ఒక గొప్ప సాంకేతిక నిపుణుడు, నాయకుడు , మంచి స్నేహితుడని కొనియాడారు. ఆయనతో కలిసి మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు.
విండోస్ ఎన్టీ’లో కీలక పాత్ర..
దక్షిణ భారతదేశంలో జన్మించిన సోమశేఖర్, లూసియానా స్టేట్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి 1989లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. మైక్రోసాఫ్ట్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులలో ఒకటైన ‘విండోస్ ఎన్టీ’ (Windows NT) అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన అసాధారణ నిర్వహణ నైపుణ్యంతో ఎదిగి, 2015 వరకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.
పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం..
మైక్రోసాఫ్ట్ తర్వాత ‘మద్రోనా వెంచర్ గ్రూప్’లో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరి, ఎంతోమంది కొత్త పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశం చేయడమే కాకుండా, ఆ ప్రాంతంలో ఇన్నోవేషన్ వ్యవస్థ బలోపేతం కావడానికి కృషి చేశారు.
ప్రొఫెషనల్ క్రికెట్..
సోమశేఖర్ సామాజిక కార్యక్రమాలలో చురుకుగా ఉండేవారు. ‘సియాటెల్ ఓర్కాస్’ ఫ్రాంచైజీకి సహ-వ్యవస్థాపకుడిగా, అమెరికాలోని పసిఫిక్ నార్త్‌వెస్ట్ ప్రాంతంలో ప్రొఫెషనల్ క్రికెట్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చారు. అలాగే మహిళా సాధికారత కోసం కృషి చేసే సంస్థలకు ఆయన మద్దతునిచ్చారు. తన భార్య అకిల , ఇద్దరు కుమార్తెలే తన ప్రపంచమని సోమశేఖర్ ఎప్పుడూ గర్వంగా చెబుతుండేవారని, ఆయన విజయాలన్నింటి వెనుక వారి ప్రేమ, మద్దతు ఉన్నాయని డెల్బెనె పేర్కొన్నారు. అమెరికా సాంకేతిక రంగంలో భారతీయ నిపుణుల పెరుగుతున్న ప్రభావాన్ని సోమశేఖర్ ప్రయాణం ప్రతిబింబిస్తుందని, ఆయన అందించిన సేవలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని సభలో కొనియాడారు.








