మలేషియాలో కేటీఆర్‌తో సింగపూర్ ఎన్నారైల భేటీ
KTR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు మలేషియా వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)తో సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలా ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.
ఉత్తమ అభివృద్ధి విధానాలను..
ఈ సందర్భంగా సింగపూర్‌లో అమలవుతున్న ఆధునిక పట్టణ ప్రణాళిక, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ, సరికొత్త టెక్నాలజీ వినియోగం వంటి పలు కీలక అంశాలపై కేటీఆర్ ఎన్నారైలతో విస్తృతంగా చర్చించారు. గతంలో కేసీఆర్ సింగపూర్, మలేషియా దేశాలలో పర్యటించినప్పుడు అక్కడి ప్రగతి నమూనాలను ఏ విధంగా అధ్యయనం చేశారనే విషయాలను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సింగపూర్, మలేషియాల్లోని ఉత్తమ అభివృద్ధి విధానాలను తెలంగాణలో ఎక్కడెక్కడ వర్తింపజేయవచ్చనే అంశంపై కూడా ఈ భేటీలో ఆలోచనలు పంచుకున్నారు. తెలంగాణను అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఇలాంటి గ్లోబల్ మోడల్స్ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో సింగపూర్‌లో కూడా ఒక భారీ తెలంగాణ సభను నిర్వహించాలని ఎన్నారై ప్రతినిధులు కేటీఆర్‌ను కోరగా, దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.
బస్సుల్లో మలేషియాకు..
ఈ ప్రత్యేక సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ నుంచి వివిధ తెలుగు, తెలంగాణ సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా బస్సుల్లో మలేషియాకు చేరుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో తెలుగు సమాజం, తెలంగాణ కల్చరల్ సొసైటీ, బీఆర్ఎస్ ఎన్నారై విభాగం, సింగపూర్ వాసవి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మంచిరెడ్డి ప్రశాంత్‌లతో పాటు బీఆర్ఎస్ సింగపూర్ ప్రతినిధులు రంజిత్ రావు, పెద్ది శేఖర్, రజినీకాంత్, కిరణ్ షెర్ల, టీసీఎస్ఎస్ సభ్యులు నల్లా భాస్కర్, రాజు, వీఏఎం ప్రతినిధులు కైల నాగరాజు, రమణ, ఎస్టీఎస్ సభ్యులు కోటి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బైరి రవి తదితరులు పాల్గొన్నారు.








