పారువేటకు ఓకే చెప్పిన మెగా మేనల్లుడు
మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు(Sambarala Yeti Gattu) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తైన వెంటనే చిత్రబృందం రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా పనులు ముగియకముందే సాయి ధరమ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించడం ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా కథల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఆయన, భిన్నమైన కథాంశాలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా సేవ్ ది టైగర్స్(Save the tigers) వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న తేజ కాకుమాను(Teja kakumanu) చెప్పిన కథకు సాయి ధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు పారువేట అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహించే పురాతన పారువేట ఉత్సవం ఆధారంగా ఈ కథను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఆధ్యాత్మికత, సంప్రదాయం, భావోద్వేగాలను మేళవించిన ప్రత్యేకమైన కథగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా, ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు క(KA) సినిమాతో ప్రశంసలు అందుకున్న డైరెక్టర్లు సుజిత్(Sujeeth), సందీప్(Sandeep) కూడా సాయి ధరమ్ తేజ్‌ను ఓ కొత్త కథతో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు కూడా హీరో ఇప్పటికే అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్(Shine screens) బ్యానర్‌పై సాహు గారపాటి(Sahu garapati) ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. ఒకేసారి రెండు విభిన్న కథలతో ముందుకు సాగుతున్న సాయి ధరమ్ తేజ్, తన కెరీర్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాడనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.








