పవన్ కల్యాణ్‌పై కవిత ‘కబ్జా’ బాణం!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని జన్వాడ ప్రాంతంలో ఉన్న ‘కోడి చెరువు’ కబ్జా ఆరోపణలను అస్త్రంగా చేసుకుని ఆమె పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో పవన్ కల్యాణ్ చేసిన సవాల్‌ను గుర్తు చేస్తూ, ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆ భూములను వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి రాసివ్వాలని డిమాండ్ చేశారు.
జన్వాడ సమీపంలోని కోడి చెరువు స్థలాన్ని ఆక్రమించి పవన్ కల్యాణ్ ఫామ్‌హౌస్ నిర్మించారంటూ గత కొన్ని రోజులుగా విపక్షాలు, పలు సామాజిక సంఘాలు గ్రౌండ్ రిపోర్టులతో సహా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను పవన్ కల్యాణ్ ఖండించారు. తన ఇంటి వద్ద పెట్టిన ప్రెస్మీట్లో దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి చెరువు స్థలాన్ని కబ్జా చేయలేదని, ఒకవేళ అది గనుక రుజువైతే వెంటనే ఆ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేస్తానని సవాల్ చేశారు.
ఇప్పుడు ఇదే అంశాన్ని కవిత ప్రధానంగా ప్రస్తావించారు. “ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారిక రికార్డులను పరిశీలిస్తే అది స్పష్టంగా చెరువు శిఖం భూమి అని తేలిపోయిందన్నారు. మరి ఇచ్చిన మాట ప్రకారం పవన్ కల్యాణ్ వెంటనే ఆ భూమిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అక్కడ అక్రమంగా వేసిన కంటైనర్లు, మట్టిని తక్షణమే తొలగించాలని కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ వనరులను, అస్థిత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొన్ని శక్తులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,200 మంది అమరవీరుల త్యాగాలు, కోట్ల మంది సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణ గడ్డ ఎవరిదో ఒకరి తాతల, ముత్తాతల జాగీరు కాదని, ఇది బరాబర్ తెలంగాణ ప్రజల జాగీరు అని స్పష్టం చేశారు.
రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేయవచ్చు కానీ, దానికి కనీస నైతికత ఉండాలని కవిత హితవు పలికారు. గతంలో తెలంగాణ వనరులను దోచుకున్న వారే ఇప్పుడు మళ్లీ ఇక్కడి సెంటిమెంట్‌ను వాడుకోవాలని చూస్తున్నారని పరోక్షంగా ఏపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజాన్ని, ఇక్కడి కళలను కేవలం తమ వ్యాపారాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారే తప్ప, ఈ ప్రాంతంపై ఎవరికీ నిజమైన ప్రేమ లేదన్నారు.
మొత్తానికి, పవన్ కల్యాణ్ ఫామ్‌హౌస్ వివాదాన్ని రీ-ఓపెన్ చేయడం ద్వారా కవిత అటు జనసేనను, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకకాలంలో టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై తమ పార్టీ మరింత ఉధృతంగా పోరాడుతుందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తామని కవిత స్పష్టం చేయడంతో, ఈ ‘కోడి చెరువు’ వివాదం మున్ముందు ఎలాంటి రాజకీయ సెగలు పుట్టిస్తుందో చూడాలి.








