ఏపీటీఎస్ సరికొత్త నిర్ణయం.. నైపుణ్యం గల సైబర్ నిపుణుల తయారే లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ
APTS: ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి “సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్” లో ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్లను అందజేశారు. ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (M.D) మల్లవరపు సూర్య తేజ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన ప్రతి అభ్యర్థికి నెలకు రూ.10,000 స్టైఫండ్ ఇవ్వడంతో పాటు, సైబర్ సెక్యూరిటీ భద్రతా విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ఛైర్మన్ మోహనకృష్ణ ప్రకటించారు.
నైపుణ్యం కలిగిన నిపుణుల తయారే లక్ష్యం..
ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత నైపుణ్యం గల సైబర్ సెక్యూరిటీ నిపుణులను తయారు చేయాలనే సంకల్పంతోనే ఈ హ్యాకథాన్ నిర్వహించామని తెలిపారు. వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో మెరిట్ సాధించిన వారికి ఈ అవకాశం కల్పించామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో డిజిటల్ పరిపాలనను బలోపేతం చేయడమే కాకుండా, సైబర్ భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. ప్రభుత్వ శాఖలకు అప్లికేషన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహణ, ఆధార్ వాలిడేషన్, ఈ-ప్రొక్యూర్మెంట్ వంటి అత్యాధునిక సేవలను అందించడంలో ఏపీటీఎస్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.

సుమారు 3,000కు పైగా..
ప్రజలను ఫిషింగ్, హ్యాకింగ్, ఓటీపీ మోసాల బారిన పడకుండా కాపాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఛైర్మన్ తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక “సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ సెంటర్”, అలాగే AP-CERT ఆధ్వర్యంలో సుమారు 3,000కు పైగా ప్రభుత్వ ఐటీ మౌలిక వసతులను 24 గంటలూ పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రారంభంలో 12,500 ఈవెంట్స్ పర్ సెకండ్ (EPS) సామర్థ్యంతో ఉన్న ఈ భద్రతా వ్యవస్థను, ప్రస్తుతం 32,500 EPS సామర్థ్యానికి పెంచి మరింత పటిష్టం చేశామని వెల్లడించారు.
భవిష్యత్ ప్రణాళికలు..
సంస్థ ఎండీ సూర్య తేజ , ఛైర్మన్ మోహనకృష్ణ మాట్లాడుతూ.. ఏపీటీఎస్ ప్రస్తుతం వెబ్ & మొబైల్ సెక్యూరిటీ ఆడిట్స్, నెట్వర్క్ సెక్యూరిటీ ఆడిట్స్, వల్నరబిలిటీ అసెస్మెంట్, పెనెట్రేషన్ టెస్టింగ్ వంటి హైటెక్ సేవలను అందిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఈ సేవలను బ్యాంకింగ్, ప్రైవేట్ రంగాలకు కూడా విస్తరించడం ద్వారా రాష్ట్రానికి అదనపు ఆదాయం సమకూరుతుందని, అలాగే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. సాంకేతికత ఆధారిత పరిపాలన, డిజిటల్ రక్షణ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపేందుకు కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు.








