మత్స్యకారులకు గుడ్ న్యూస్.. ప్రమాదం జరిగితే రూ.5 లక్షల బీమా..ఎలా పొందాలంటే!
Fishermen Insurance Scheme: మత్స్యకారుల జీవనానికి కష్టకాలంలో ఆసరాగా నిలిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ బీమా పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ‘ప్రధాన మంత్రి మత్స్య యోజన’ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లోని మత్స్యకార సంఘాల సభ్యులందరికీ ఈ బీమా వర్తించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 12 మంది మత్స్యకారులు మృతి చెందగా, వారిలో ముగ్గురికి రూ.5 లక్షల చొప్పున బీమా పరిహారం అందింది. మిగతా దరఖాస్తులు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి.
ప్రమాదం జరిగి వారు మరణిస్తే..
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో మహిళా, పురుష విభాగాలకు కలిపి మొత్తం 1077 సంఘాలు ఉండగా, వాటిలో 60,195 మంది సభ్యులు ఉన్నారు. నాలుగు జిల్లాల వారీగా చూస్తే.. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 379 సంఘాలు, 24,601 మంది సభ్యులు ఉండగా, మెదక్ జిల్లాలో 311 సంఘాలు, 16,820 మంది సభ్యులు ఉన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో 235 సంఘాలు, 13,134 మంది సభ్యులు, వికారాబాద్ జిల్లాలో 152 సంఘాలు, 5,640 మంది సభ్యులు ఉన్నారు. మత్స్యకారులు నిత్యం చెరువులు, కుంటలు, నదుల్లోకి చేపల వేటకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగి వారు మరణిస్తే కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలే మత్స్యకారుల పేరిట రూ.79.60 ప్రీమియం చెల్లిస్తున్నాయి. అయితే, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడంలో నాలుగు జిల్లాల్లోని మత్స్యకారులు ఇంకా వెనకడుగు వేస్తున్నారు.
పరిహార వివరాలు
ఈ బీమా పథకం ద్వారా మత్స్యకారులకు లభించే పరిహార వివరాలు ఇలా ఉన్నాయి. ఒకవేళ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం అందుతుంది. ఒకవేళ శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే రూ.2.50 లక్షల సాయం లభిస్తుంది. ప్రమాదాల్లో గాయపడితే ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.25 వేలు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన సీఎస్సీ (CSC) కేంద్రాల నిర్వాహకులు గ్రామాల్లోకి వెళ్లి సభ్యుల వివరాలు సేకరించి, ఆన్లైన్లో నమోదు చేసి ఈ బీమా సదుపాయం కల్పిస్తారు.
ఆన్లైన్లో నమోదు..
ఈ విషయమై మెదక్ జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం మాట్లాడుతూ.. బీమా సదుపాయాన్ని త్వరితగతిన పొందేందుకు మత్స్యకార సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నామినీ ఖాతా, ఆధార్ తదితర వివరాలను మీ వద్దకు వచ్చే సీఎస్సీ నిర్వాహకులకు అందించి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. 18 నుండి 70 సంవత్సరాల వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. రైతు బీమా మాదిరిగానే ఈ బీమా పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని ఆయన తెలిపారు.








