సింగీతం మాంత్రికతకు నాగ్ అశ్విన్ ఫిదా..
జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సింగ్ గీతం(Sing geetham) సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నిర్మాత నాగ్ అశ్విన్(nag ashwin) సినిమా రూపకల్పన వెనుక ఉన్న విశేషాలను పంచుకున్నారు. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(singeetham srinivasarao)తో కలిసి పనిచేయడం తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన అనుభవమని ఆయన పేర్కొన్నారు. సినిమా స్క్రిప్ట్ అభివృద్ధి కోసం దాదాపు తొమ్మిది నెలల పాటు బృందం శ్రమించిందని, ఆ తర్వాత నటీనటులతో విస్తృత స్థాయిలో రిహార్సల్స్ నిర్వహించినట్లు వెల్లడించారు. వయసుతో సంబంధం లేకుండా సింగీతం ఇప్పటికీ కొత్త ఆలోచనలతో ఉత్సాహంగా పనిచేస్తారని, మరింత మెరుగైన పరిష్కారం కనిపిస్తే వెంటనే మార్పులు చేయడానికి వెనుకాడరని నాగ్ అశ్విన్ తెలిపారు.
ఈ సినిమా నిర్మాణంలో తాను కేవలం నిర్మాతగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్లా కూడా పనిచేశానని నాగ్ అశ్విన్ చెప్పారు. సింగీతం ఆలోచనలను తెరపై సరిగ్గా ఆవిష్కరించేందుకు ప్రతి దశలో భాగస్వామిగా ఉన్నానని వివరించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎక్కువమంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవకాశం కల్పించడం విశేషం. కొత్త తరానికి చెందిన టాలెంట్ తో పనిచేయడం సింగీతంకు ఎప్పుడూ ఇష్టమని, తాజా ఆలోచనలతో వచ్చే యూత్‌ను ఆయన ఎంతో ప్రోత్సహిస్తారని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.
ఇక సింగ్ గీతంను ఇతర భాషల్లోకి తీసుకెళ్లే అవకాశాలపై కూడా ఆయన స్పందించారు. తమిళ వెర్షన్ ఇప్పటికే ప్రణాళికలో ఉందని, అయితే ప్రతి డైలాగ్ సంగీత రూపంలో ఉండటంతో ఇతర భాషల్లోకి అనువదించడం పెద్ద సవాలుగా మారుతుందని చెప్పారు. అయినప్పటికీ ఈ వినూత్న సినిమాను మరింత విస్తృత ప్రేక్షకులకు చేరవేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. నిజాయితీ, సృజనాత్మకత, ఊహాశక్తి కలగలిసిన ఈ సినిమా భారతీయ సినీ ప్రపంచంలోని గొప్ప దర్శకుల్లో ఒకరైన సింగీతం విజన్‌కు నిదర్శనంగా నిలుస్తుందని నాగ్ అశ్విన్ అభిప్రాయపడ్డారు.








