యూఎస్‌లో ఘోరం.. ఫేక్ ఆర్డర్‌తో తెలంగాణ యువకుడి కాల్చివేత
Kuncha Anshul: ఉపాధి కోసం అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన కుంచ అన్షుల్ (28) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. నార్త్ ఫిలడెల్ఫియాలో నివసిస్తున్న ఆయన, వారాంతాల్లో అదనపు ఆదాయం కోసం పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండగా ఈ ఘోరం జరిగింది. దుండగులు పక్కా వ్యూహంతో ఫేక్ ఆర్డర్ పెట్టి, ఆయనను నిర్మానుష్య ప్రాంతానికి రప్పించి తలపై కాల్చి చంపినట్లు తెలుస్తోంది.
కుటుంబ సభ్యులు , అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచ శ్రీనివాస్, నీలిమ దంపతుల కుమారుడైన అన్షుల్ 2023లో అమెరికా వెళ్లారు. అక్కడ కేడబ్ల్యూసీ అనే సంస్థలో ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైమ్‌గా డెలివరీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నిర్మానుష్య ప్రాంతంలో ట్రాప్..
శుక్రవారం రాత్రి ఎడ్జ్లీ స్ట్రీట్‌లోని రేమండ్ రోజెస్ హోమ్స్ ప్రాంగణంలో గల ఒక నిర్మానుష్య ప్రదేశం నుండి మూడు పిజ్జాల కోసం ఆర్డర్ వచ్చింది. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో అన్షుల్ ఆ డెలివరీ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాడు. ఆయన వాహనం దిగి లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే, మాస్కులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు హఠాత్తుగా వచ్చి అన్షుల్ తల వెనుక భాగంలో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన అన్షుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుండి పోలీసులు మూడు బుల్లెట్ షెల్స్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
తల్లిదండ్రులకు విజ్ఞప్తి ..
ఈ ఘటనపై అన్షుల్ సోదరి తన్వి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డెలివరీకి వెళ్లిన అన్షుల్ వద్ద ఉన్న వస్తువులేవీ చోరీకి గురికాలేదని, కేవలం ఆయనను టార్గెట్ చేసి, ట్రాప్ చేసి పక్కాగా చంపేశారని ఆమె ఆరోపించారు. మీడియా ముందు కన్నీరుమున్నీరైన ఆమె, తమ సోదరుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అంతేకాకుండా, “దయచేసి మీ పిల్లలను ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో అమెరికా పంపించవద్దు” అంటూ ఇతర తల్లిదండ్రులకు ఆమె కన్నీటితో విజ్ఞప్తి చేశారు.








