ఇరాన్ రాడార్ కేంద్రాలపై అమెరికా దాడులు..!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చమురు రవాణకు కీలకమైన హర్మూజ్ సమీపంలో ఇరాన్ డ్రోన్లు ప్రయోగించడం.. అమెరికా ఆగ్రహానికి కారణమైంది. దీంతో ఇరాన్ కు చెందిన తీరప్రాంత నిఘా రాడార్ కేంద్రాల లక్ష్యంగా దాడులు చేసింది.
హర్మూజ్ (Strait of Hormuz)లో నౌకల రవాణాకు ఇరాన్ డ్రోన్ దాడులు ముప్పుగా మారాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) పేర్కొంది. అందుకే తక్షణమే స్పందించాల్సి వచ్చిందని తెలిపింది. టెహ్రాన్‌కు చెందిన నాలుగు డ్రోన్లను కూల్చివేశామని వెల్లడించింది. దీని తర్వాత గోరుఖ్, ఖేష్మ్ ద్వీపంలోని ఇరాన్ రాడార్ కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. మరిన్ని దాడుల నుంచి రక్షించుకోవడానికే ఈ చర్యలు చేపట్టినట్లు సెంటకామ్ తెలిపింది. ఇరాన్ దురాక్రమణల నుంచి రక్షించుకునేందుకు తమ ప్రతిస్పందనలు కొనసాగుతాయని స్పష్టంచేసింది. ఈ సంఘర్షణను ముగించేందుకు ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. దాడులు మాత్రం ఆగడం లేదు.
మరోవైపు..కువైట్‌లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది… తమ గగనతలం పైకి దూసుకొచ్చే క్షిపణులు, డ్రోన్లను వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని కువైట్ (Kuwait) తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆపై బహ్రెయిన్‌లో కూడా సైరన్లు మోగడంతో బలగాలు అప్రమత్తమయ్యాయి.








