కేసీఆర్.. దమ్ముంటే చర్చకు రా.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, ఫలితంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు రోజుల పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి సమీపంలోని ఉద్దండాపూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
పాలమూరు ప్రజల సెంటిమెంట్‌తో కేసీఆర్ ఆడుకున్నారని మండిపడ్డారు. కరీంనగర్ నుంచి వలస వచ్చిన కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఆదరించారని, వలసల గోస తీరుస్తాడని నమ్మితే ఆయన మాత్రం ప్రజలను ఘోరంగా మోసం చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో దాదాపు 8 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ, కేసీఆర్ పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తిగా పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు. ఐదేళ్లు ఎంపీగా ఉండి, కనీసం ఐదు సార్లు కూడా పాలమూరుకు వచ్చిన సందర్భం లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, గొర్రె కసాయిని నమ్మినట్లు జనం కేసీఆర్‌ను రెండుసార్లు సీఎంగా చేస్తే.. ఆయన తన కుటుంబాన్ని బాగుపరుచుకున్నారు తప్ప ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం ఇప్పుడు పాదయాత్రలు చేసినా, త్వరలో వచ్చి దండాలు పెట్టినా వారు చేసిన పాపాలు అస్సలు తీరవన్నారు.
బీఆర్ఎస్ అధినేతకు సీఎం రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సవాల్ విసిరారు. “గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిన చోటే బీఆర్ఎస్ నాయకులు ఓట్లు అడగాలి. మేము పేదలకు ఇచ్చిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిన చోట మాత్రమే ఓట్లు అడుగుతాం” అని సవాల్ చేశారు. తన 30 నెలల పాలనపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. ఈ పాలనపై చర్చల్లో ఓడిపోతే దేనికైనా సిద్ధమని, మీతో చెప్పించుకునే స్థితిలో తాము లేమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గతంలో పాలమూరు జిల్లాలో విద్యా ప్రాజెక్టులను ఎవరూ పట్టించుకోలేదని సీఎం అన్నారు. తమ ప్రభుత్వంలో పేద పిల్లలు ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా ఎదగాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. అందుకోసమే ఉమ్మడి పాలమూరులో త్రిబుల్ ఐటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలను తెచ్చుకున్నామని చెప్పారు. ఒకప్పుడు కొడంగల్ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం మహబూబ్‌నగర్, తాండూరు వెళ్లేవారని.. ప్రస్తుతం ఇక్కడే అన్ని రకాల ఉన్నత ప్రమాణాలతో కాలేజీల నిర్మాణాలు జరగడంతో, హైదరాబాద్ నుంచి కూడా విద్యార్థులు వచ్చి ఇక్కడ చదివే వాతావరణం కల్పించామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన తాను ఈరోజు సీఎం స్థాయికి ఎదిగానని, తల్లిదండ్రుల తలరాతలు మారాలంటే పిల్లలను తప్పకుండా చదివించాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించి జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగానే రాబోయే డిసెంబర్ నాటికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 90 టీఎంసీల నీటిని అందిస్తామని కీలక హామీ ఇచ్చారు.








