మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ భేటీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ (Fadnavis)తో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) భేటీ అయ్యారు. ముంబయిలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర (Maharashtra) నుంచి రాష్ట్రానికి రెండు ఆడ పులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. తూర్పు కనుమల ప్రాంతంలో ఆడ పులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్లు పవన్ తెలిపారు.
రాష్ట్రానికి రెండు ఆడ పులులు (Tigresses) ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఈ సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పవన్ చెప్పారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఆడ పులుల ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి సమస్యలను అధిగమించడంతోపాటు జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.








