Devendra Fadnavis: పాకిస్థాన్ నెంబర్ నుంచి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు బెదిరింపులు!

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis)కు ఒక పాకిస్థాన్ నెంబర్ బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది. ముంబయి ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్‌లో ఒక బెదిరింపు మెసేజ్ వచ్చింది. మహారాష్ట్ర (Maharashtra) సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తామని, ఇతర ప్రభుత్వ భవనాలను టార్గెట్ చేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ఈ బెదిరింపులు చేశారు. ఈ సందేశం పంపిన వ్యక్తి పేరు మాలిక్ షాబాజ్ హుమయూన్ రాజాదేవ్‌గా అని పోలీసులు తెలిపారు. ఈ మెసేజ్ పాకిస్థాన్ (Pakistan) నుంచి వచ్చిందని పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis), ఆయన కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా, ఇతర ప్రభుత్వ భవనాల వద్ద కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మెసేజ్‌కు సంబంధించి కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఈ సందేశం పంపిన వ్యక్తిని గుర్తించడానికి దర్యాప్తును చేపట్టారు. కాగా, ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు (Eknath Shinde) కూడా ఇలాగే బెదిరింపులు వచ్చాయి. ఆయన వాహనాన్ని బాంబుతో పేల్చేస్తామని, షిండేను టార్గెట్ చేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు ముంబయి పోలీసులకు మెయిల్ ద్వారా బెదిరింపులు పంపారు. అయితే ఈ బెదిరింపులు ఫేక్ అని పోలీసులు తేల్చారు. అయితే, ఈ బెదిరింపు మెయిల్ కూడా పాకిస్థాన్ (Pakistan) నుంచే వచ్చినట్లు సమాచారం.