2030 నాటికి కాలుష్య రహిత సిటీగా ఢిల్లీ… రోడ్ మ్యాప్ ప్రకటించిన ప్రభుత్వం
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఎప్పటి నుంచో దీనిని కట్టడి చేయాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆప్ అధికారంలో వున్న సమయంలో ఢిల్లీలో సరి- బేసి సంఖ్యలున్న వాహనాలను రోజు తప్పించి రోజు అనుమతించారు. కానీ.. కాలుష్యం మాత్రం తగ్గలేదు.
దీంతో ఇప్పటి బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2030 నాటికి కాలుష్య రహిత నగరంగా ఢిల్లీని మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యుత్తు వాహనాలను ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా భారీగా పన్ను రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో పాటు 2027 జనవరి నుంచి ఎలక్ట్రిక్ ఆటోలు, 2028 ఏప్రిల్ నుంచి పెట్రోలు, సీఎన్ జీ వాహనాల రెజిస్ట్రేషన్లను ఇక అనుమతించరు. ఈ మేరకు సీఎం రేఖా గుప్తా ఆధ్వర్యంలో కేబినెట్ నిర్ణయించింది.కొత్త విధానంలో భాగంగా జూలై 1 వ తేదీ నుంచి 30 లక్షల లోపు విద్యుత్ వాహనాలపై జీవితకాల పన్నును, రిజిస్ట్రేషన్ ఛార్జీలను ప్రభుత్వం ఎత్తేస్తోంది.
1. 2030 నాటికి మొత్తం పాఠశాలల బస్సుల్లో 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలుగా మారనున్నాయి.
2. 30 వేల ఈవీ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. ఈవీల మౌలిక వసతుల కోసం నాలుగేళ్లలో 7,000 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.
3. పాలసీ అమలులోకి వచ్చిన తొలి యేడాదిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేసే వారికి 30 వేల ప్రోత్సాహకం, రెండో ఏడాదిలో 20,000, మూడో యేడాదిలో 10,000 ఇస్తారు.
4. బీఎస్-4 వాహనాలను తుక్కుగా మార్చుకునేందుకు ముందుకు వచ్చే వారికి లక్ష రూపాయల ప్రోత్సాహకం.
5. 2027 జనవరి 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్ ఆటోలకే రిజిస్ట్రేషన్ చేస్తారు. పెట్రోలు, సీఎన్ జీ వాహనాలను అనుమతించరు.








