కేంద్ర ఆర్థిక మంత్రిగా శక్తికాంత దాస్? ఈయన ప్రత్యేకత ఇదే..
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని విపరీతమైన ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. దీంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.దీంతో కేంద్ర మంత్రుల్లో టెన్షన్ నెలకొంది. అయితే.. ఈ విషయంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ను తప్పించి, కొత్తగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ ను నియమించనున్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్ కి మానవ వనరుల అభివృద్ధి శాఖను కేటాయిస్తారన్న చర్చ ఊపందుకుంది.
కీలక శాఖల్లో ఆయా శాఖల నిపుణులుగా….
అయితే.. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చారు. ఆయా మంత్రిత్వ శాఖలకు రాజకీయ నేతలను కాకుండా, ఆ రంగానికి చెందిన నిపుణులను మంత్రిగా నియమించే సంస్కృతిని తెచ్చారు. ఇందులో ముఖ్యంగా విదేశాంగ శాఖ మంత్రిగా, మాజీ రాయబారి ఎస్. జైశంకర్ ను నియమించారు. దీంతో విదేశీ వ్యవహారాల్లో జైశంకర్ అత్యంత నిపుణులు కావడంతో ప్రపంచ యవనికపై భారత్ రూపు రేఖలు మారిపోయాయి. ఏ దేశంతో ఎలా డీల్ చేయాలో జైశంకర్ కి బాగా తెలుసు. దీంతో ప్రధాని మోదీకి మరింత సులువవుతోంది.
అచ్చు ఇలాగే ఆర్థిక శాఖ విషయంలోనూ ప్రధాని మోదీ తాజాగా అలాగే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా వున్న నిర్మలా సీతారామన్ ని తప్పించి, ఆమె స్థానంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ ను నియమించాలని దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఆర్థికంగా దేశం ఇబ్బందుల్లో వున్న పరిస్థితుల్లో శక్తికాంత దాస్ ఈ బాధ్యతను సమర్థవంతంగా పోషిస్తారని మోదీ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆర్థిక శాఖ నిపుణులు శక్తికాంతను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం శక్తికాంత దాస్ పీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా బాధ్యతల్లో వున్నారు.
శక్తికాంత దాస్ నేపథ్యం ఇదీ…
శక్తికాంత దాస్ భారత పరిపాలనా సేవ (ఐఏఎస్)లో అత్యంత అనుభవజ్ఞుడైన, సీనియర్ విశ్రాంత అధికారి. ఆయన కేంద్ర మంత్రివర్గంలో భాగమైతే, పరిపాలన, ఆర్థిక రంగాలలోని వివిధ విభాగాలలో నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న ఆయన అపారమైన పరిపాలనా అనుభవం ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరుస్తుంది.
ఆర్బీఐ గవర్నర్ గా 2018 నుంచి 2024 వరకూ కొనసాగారు. 25 వ ఆర్బీఐ గవర్నర్ గా వున్నారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాల సమయంలోనూ భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు ఆయన స్థిరత్వాన్ని చేకూర్చారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసిన కాలంలో, ఎనిమిది కేంద్ర బడ్జెట్ల రూపకల్పన ప్రక్రియలో ఆయన ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు; తద్వారా ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు మరియు ఆర్థిక విధానాల రూపకల్పనలో అసాధారణ అనుభవాన్ని గడించారు.
దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రక్రియకు సంబంధించిన ప్రణాళిక మరియు అమలు దశలలో, ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో ఆయన అత్యంత సీనియర్ మరియు కీలక అధికారిగా వ్యవహరించారు. అంతేకాకుండా, ఆయన 15వ ఆర్థిక సంఘం సభ్యునిగా మరియు భారతదేశ G20 షెర్పాగా కూడా సేవలందించారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కళాశాల పూర్వ విద్యార్థి అయిన శక్తికాంత దాస్, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మరియు ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంక్ వంటి సంస్థలలో భారతదేశ ప్రత్యామ్నాయ గవర్నర్గా దేశానికి ప్రాతినిధ్యం వహించారు.








